ఎక్కువ గంటలు మేకప్‌ ఉండాలంటే...

పండుగలూ, వేడుకలప్పుడు హడావుడి ఎక్కువ. దీంతో శరీరానికి చెమట పట్టి మేకప్‌ కరిగిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా జిడ్డుచర్మ తత్వం ఉన్న వారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.

Published : 11 Oct 2022 00:28 IST

పండుగలూ, వేడుకలప్పుడు హడావుడి ఎక్కువ. దీంతో శరీరానికి చెమట పట్టి మేకప్‌ కరిగిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా జిడ్డుచర్మ తత్వం ఉన్న వారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి వారికి ఎక్కువ గంటలు మేకప్‌ చెక్కుచెదరద్దంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలను నిపుణులు చెబుతున్నారిలా... 

సాయనాల్లేని లిక్విడ్‌ ఫేస్‌వాష్‌తో ముఖాన్ని ముందుగా శుభ్రపరుచుకోవాలి. అప్పటికే శుభ్రం చేసుంటే గనుక, రోజ్‌వాటర్‌ క్లెన్సర్‌ను ముఖానికంతటికీ స్ప్రే చేసి దూది ఉండతో మృదువుగా తుడవాలి. ఇలా చేసినప్పుడు ముఖంపై ఎక్కడైనా మురికి ఉంటే దూరమవుతుంది. మేకప్‌కు ముందుగా ముఖచర్మం పరిశుభ్రంగా ఉండటం తప్పనిసరి. ఆ తర్వాత ఐస్‌క్యూబ్స్‌తో ముఖాన్ని మృదువుగా రుద్ది ఆరనిస్తే ముఖం తాజాగా కనిపిస్తుంది.


ప్రైమర్‌.. జిడ్డు చర్మం ఉన్నవారికి ప్రైమర్‌గా కలబంద గుజ్జు మంచి ఫలితాన్నిస్తుంది. ఎక్కువసేపు మేకప్‌ చెరగకుండా ఉంచగలుగుతుంది. ముఖానికి మృదువుగా కలబంద గుజ్జుని ప్రైమర్‌గా రాసి అయిదునిమిషాలు ఆరనివ్వాలి. లేదంటే బేబీ మాయిశ్చరైజర్‌ రాసుకున్నా మంచిదే. రెండు చుక్కలు అరచేతిలో వేసుకొని ముఖంపై రాసి మృదువుగా మర్దన చేసి  రెండు నిమిషాలు ఆరనిస్తే పూర్తిగా చర్మంలో ఇంకుతుంది.


ఫౌండేషన్‌... జిడ్డు చర్మతత్వానికి సరిపోయేలా, అలాగే శరీరవర్ణానికీ తగ్గట్లుగా ఫౌండేషన్‌ను ఎంపిక చేసుకోవాలి. లిక్విడ్‌ ఫౌండేషన్‌ రెండు మూడు చుక్కల్ని తీసుకుని వేళ్లతో ముఖమంతా రాసుకోవాలి. అది ఆరాక కాంపాక్ట్‌ పౌడర్‌ను లైట్‌గా అద్దాలి. హైలైటర్‌తో చెక్కిళ్లు, ముక్కు చివర, గడ్డంపై తీర్చిదిద్దితే ముఖం మెరిసిపోతుంది.


కంటికి.. కనురెప్పలను విశాలంగా కనిపించేలా చేయడానికి ముందుగా కాస్తంత ప్రైమర్‌ను రాసుకోవాలి. ఆపై బ్రష్‌తో  ఐషాడో వేయాలి. మీరెంచుకున్న దుస్తుల్ని బట్టి, చర్మ ఛాయకి నప్పేలా ఈ రంగుల్ని ఎంచుకోవాలి. ఆపైన కనుబొమలను పెన్సిల్‌తో లైనింగ్‌ చేసి బ్రష్‌ చేయాలి. కంటికి కాటుక దిద్దిన తర్వాత కనురెప్పలు ఒత్తుగా కనిపించడానికి మస్కారా వేయాలి. ఆపై రెండు నిమిషాలు ఆరనిస్తే చాలు. కళ్లు ఆకర్షణీయంగా కనిపిస్తాయి.


అధరాలను.. పెదవులకు లిప్‌స్టిక్‌ వేయడానికి ముందుగా లిప్‌బామ్‌ రాయాలి. రాత్రి సమయాల్లో ముదురు వర్ణాలను ఎంచుకుంటే మేలు. దుస్తులకు తగినట్లు ముఖాన్ని ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి. పండగ కళ ముఖంలో కనిపించాలంటే ఆరేడు గంటల నిద్ర, ఏడు గ్లాసుల నీరూ తాగితే చాలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్