అయినా.. జిడ్డుగా కనిపిస్తోంటే!

తలస్నానం చేసిన కొద్దిరోజులకు జుట్టంతా నూనెతో నిండిపోవడం సాధారణమే! కానీ కొందరిలో మరుసటి రోజుకే అలా కనిపిస్తుంటుంది. చుండ్రు, వెంట్రుకలు రాలడం అదనం.

Updated : 12 Oct 2022 14:43 IST

తలస్నానం చేసిన కొద్దిరోజులకు జుట్టు జిడ్డుగా మారడం సహజమే.  కానీ కొందరిలో మరుసటి రోజుకే అలా కనిపిస్తుంటుంది. చుండ్రు, వెంట్రుకలు రాలడం అదనం. వీటికేం చేయాలి? నిపుణుల సూచనలివిగో..

* కొందరికి తలలో నూనె గ్రంథులు ఎక్కువగా ఉంటాయి. దీంతో త్వరగా మాడు, కురులంతా జిడ్డుగా మారిపోతాయి. ఇంకొన్నిసార్లు చర్మ సమస్యలు కావచ్చు. తలలో విపరీతమైన దురద, పొట్టు రాలడం లాంటివి కనిపిస్తే సెబోరియక్‌ డెర్మటైటిస్‌గా చెబుతారు. చర్మం ఎర్రబడటం, ప్యాచ్‌లుగా ఊడిపోతుంటే ఎగ్జిమా, సొరియాసిస్‌ అయ్యుండొచ్చు. విపరీతమైన కాలుష్యం, నూనె ఆధారిత షాంపూ, కండిషనర్‌లను వాడుతున్నా ఈ సమస్య ఎదురవుతుంది. ముందు వీటిల్లో ఏది కారణమో తెలుసుకోండి. చర్మ సమస్యలైతే తగిన చికిత్స తీసుకోవాలి. లేదంటే కొన్నిమార్పులు చేసుకుంటే సరిపోతుంది.

* వారానికి 2-3సార్లు తప్పక తలస్నానం చేయాలి. బాగా నూనె రాసి, షాంపూ సరిగా చేయకపోయినా ఈ సమస్య కనిపిస్తుంది. జిడ్డు బాగా పడుతోంటే నూనె ఆధారిత షాంపూ, కండిషనర్‌కి దూరంగా ఉండాలి. అలాగే కండిషనర్‌ని మాడు నుంచి కాకుండా కురులకే పరిమితం చేయండి.

* త్వరగా ఆరాలని హెయిర్‌ డ్రైయర్‌ ఉపయోగించడం, స్టైలింగ్‌ పేరుతో స్ట్రెయిటనింగ్‌ చేయడం వంటివీ జిడ్డుకు కారణాలే. వీటికి వీలైనంత దూరంగా ఉంటే మంచిది. దువ్వెనలు, హెయిర్‌ బ్రష్‌లనీ తరచూ శుభ్రం చేసుకోవాలి.

* సహజ పదార్థాలతో చేసిన షాంపూలు లేదా కుంకుడు, శీకాకాయ వంటివాటిని ఉపయోగించినా ఈ సమస్యలుండవు. లేదూ.. షాంపూ చేసి, కడిగాక మగ్గు నీటిలో పావుకప్పు యాపిల్ సిడార్‌ వెనిగర్‌ కలిపి తలకు పట్టించండి. పదినిమిషాలయ్యాక కడిగేస్తే సరి! వీటితోపాటు పెరుగు, టీట్రీఆయిల్‌, లవంగ నూనె వంటివి తరచూ పెట్టినా జిడ్డూ, దాని కారణంగా వచ్చే చుండ్రు వంటి వాటికి దూరంగా ఉండొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్