Published : 18/01/2023 00:21 IST

రంగు వేసే ముందు...

ఈ రోజుల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ జుట్టుకి రంగు వేసేవాళ్లే. కొందరు ట్రెండ్‌ అంటే, మరికొందరు తెల్లబడిన వెంట్రుకలు నల్లగా కనిపించేందుకు... అయితే ఎలా వేసుకున్నా... ఈ నియమాలు మరిచిపోవద్దు.

రంగు కొనేటప్పుడే అమ్మోనియా, సల్ఫేట్‌ ఫ్రీ,  కలర్‌ సేఫ్‌ రకాలను కొనడం వల్ల... ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. అలానే రంగు వేసుకోవడానికి ముందే, చెవి వెనక కొద్దిగా ప్యాచ్‌ టెస్ట్‌ చేయాలి. కళ్లు మండినా, ఇతరత్రా అలర్జీలూ, తలనొప్పి వంటివి వచ్చినా నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే డాక్టరు దగ్గరకు వెళ్లండి. ఆ ఉత్పత్తిని వాడటం మానేయండి.

జుట్టుకి కలరింగ్‌ చేయాలనుకున్నప్పుడు... అది వేసుకోవడానికి వారం పదిరోజుల ముందు నుంచే... తలకి ఏ ఇతర రసాయనిక ఉత్పత్తులనూ వాడకపోవడమే మంచిది. మూడు రోజుల ముందు జుట్టుకి నాణ్యమైన కండిషనర్‌ పెట్టి తలస్నానం చేయాలి. ఆ తర్వాతే రంగు వేయాలి. ఇలా చేస్తే జుట్టుకు రంగు చక్కగా పట్టుకుని ఆరోగ్యంగా కనిపిస్తుంది. అదే పీచులా పొడిబారిన జుట్టుకు రంగు వేయడం వల్ల చూడ్డానికి ఏమాత్రం బాగుండదు. అసహజంగానూ అనిపిస్తుంది.

రంగు వేసుకున్న మరుసటి రోజే తలస్నానం చేసేయకూడదు. కనీసం రెండు రోజులు ఆగి తలస్నానం చేస్తే రంగు జుట్టు కుదుళ్లకి పట్టుకుంటుంది. స్నానం చేసే నీళ్లలో ఉండే క్లోరిన్‌, కాల్షియం వంటి ఖనిజాలు తలపై చేరిప్పుడు అవి రంగులోని రసాయనాలతో చర్య జరిపి విచిత్రమైన రంగుల్లోకి మారుతుంటాయి. వీలైనంత వరకూ తలస్నానాలు తగ్గించుకోవడం లేదా మంచి నీటితో స్నానం చేయడం ఇందుకు పరిష్కారం.

తలకి రంగు వేసుకున్న తర్వాత మరీ వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల రంగు వేసిన ఫలితం ఉండదు. ఎందుకంటే వేడి నీళ్లు మాడులోని వెంట్రుకల కుదుళ్లని తెరుచుకునేట్టు చేస్తాయి. రంగూ త్వరగా వెలిసిపోతుంది. బదులుగా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని