Published : 03/02/2023 00:10 IST

మృదుత్వానికి సహజ మాయిశ్చరైజర్లు..

చలిగాలి ప్రభావంతో చర్మం పొడారి, మృదుత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. సహజసిద్ధమైన మాయిశ్చరైజర్లతో చర్మసౌందర్యాన్ని పరిరక్షించుకోవచ్చు.

చాక్లెట్‌తో.. ఒక కప్పులో చాక్లెట్‌ బార్‌ నుంచి తీసిన నాలుగు ముక్కలను కరిగించి, చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసి పావుగంట ఆరనివ్వాలి. చివరగా తడిపిన చేతులతో ముఖంపై మృదువుగా ఐదునిమిషాలు మర్దనా చేసి కడగాలి. చాక్లెట్‌లోని కెఫీన్‌ చర్మకాంతిని రెట్టింపు చేస్తే, దీన్లోని కొవ్వులు సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేసి మృదుత్వాన్ని అందిస్తాయి. తేనె చర్మాన్ని తేమగా ఉంచి, పొడారకుండా సంరక్షిస్తుంది.

మయనీజ్‌తో.. రెండు చెంచాల మయనీజ్‌కు చెంచా బేబీ ఆయిల్‌ను కలిపి ముఖం, మెడ, చేతులకు రాయాలి. ఇరవై నిమిషాల తర్వాత కడిగితే చర్మం మెరుపులీనుతుంది.

* రెండేసి చెంచాల చొప్పున కలబంద గుజ్జు, బాదంనూనె, తేనె తీసుకొని మిశ్రమంగా చేసి ముఖానికి రాసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. దీంతో చర్మం మృదువవుతుంది.

బొప్పాయితో.. కప్పు బొప్పాయి ముక్కలకు అరకప్పు నీటిని కలిపి మిక్సీలో వేయాలి. ఈ మిశ్రమంలో ముంచిన దూది ఉండతో ముఖమంతా అద్ది, పావుగంట తర్వాత కడగాలి. పోషకాలు మెండుగా ఉండే బొప్పాయి చర్మానికి తేమను అందించి మెరుపులీనేలా మారుస్తుంది.

కోడిగుడ్డుతో...  పసుపు సొనకు చెంచా బాదంనూనె కలిపి ముఖం, మోచేతులకు రాసి ఆరనిచ్చి కడిగినా చర్మం మృదువుగా మారుతుంది.

తాజా క్రీంతో.. ఒక అరటిపండును గుజ్జులా చేసి, దీనికి మూడు చెంచాల తాజా మీగడను కలిపి ముఖానికి రాయాలి. 20 నిమిషాల తర్వాత మృదువైన వస్త్రంతో తుడవాలి. ఆ తర్వాత నీటితో కడిగితే చర్మం మాయిశ్చరైజ్‌ అవుతుంది. పోషకాలు అంది ముఖచర్మం మృదువుగా మారుతుంది.

* సమపాళ్లలో కొబ్బరినూనె, తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు రాసి అరగంట తర్వాత కడిగితే సరి.  యాంటీమైక్రోబియల్‌ గుణాలుండే కొబ్బరినూనె చర్మరంధ్రాల్లోని సూక్ష్మజీవులను దూరంచేసి, పొడారకుండా చేస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని