Published : 28/02/2023 00:59 IST

కురులు.. పట్టుకుచ్చులా

వాతావరణం మారుతున్న ప్రతిసారీ జుట్టు పొడారి, చుండ్రు సమస్య తలెత్తుతుంది. కొన్ని రకాల నూనెలతో ఈ సమస్యల నుంచి శిరోజాలను సంరక్షించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఒత్తైన జుట్టు సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు.

విటమిన్‌ ఈ, ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉండే ఆలివ్‌నూనె శిరోజాలను మృదువుగా ఉంచుతుంది. వారానికొకసారి తలస్నానానికి ముందు ఈ నూనెను శిరోజాల మొదళ్ల నుంచి మృదువుగా రాసి మర్దనా చేసి అరగంట ఆరనివ్వాలి. ఆ తర్వాత రసాయనరహిత షాంపూతో తలస్నానం చేయాలి.

బాదంనూనె.. ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌, ఈ విటమిన్‌ , ప్రొటీన్లు మెండుగా ఉండే బాదంనూనె శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. బలంగా ఉంచి, కొత్త జుట్టు పెరగడానికి దోహదపడుతుంది. శిరోజాల చివర్లు చిట్లిపోయే సమస్య నుంచి కూడా దూరంగా ఉండొచ్చు. వారంలో రెండుసార్లు తలకు ఈ నూనె మర్దన తప్పనిసరి చేసుకొంటే పొడారనివ్వకుండా పరిరక్షించుకోవచ్చు. అలాగే రాలే సమస్య దూరమై, మెత్తని ఒత్తైన కురులను సొంతం చేసుకోవచ్చు.

అవకాడో నూనె.. కొవ్వు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉండే అవకాడో నూనె జుట్టును నిత్యం ఆరోగ్యంగా ఉంచుతుంది. పొడారి చిక్కుపడినట్లుగా మారే శిరోజాలకు మృదుత్వాన్ని అందిస్తుంది. వాతావరణ కాలుష్యం, సీజన్ల ప్రభావం పడకుండా మాడును ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా రక్షిస్తుంది.

ఆర్గాన్‌ నూనె.. విటమిన్‌ ఇ, ఫ్యాటీ యాసిడ్లూ ఉండే ఈ నూనె జుట్టుకు మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. దీన్ని కొబ్బరినూనెకు సమపాళ్లలో కలిపి వారానికి రెండుమూడుసార్లు తలకు రాసి మృదువుగా మర్దన చేయాలి. నాలుగైదు గంటలు ఆరనిచ్చి తలస్నానం చేస్తే చాలు. జుట్టు పొడారడం తగ్గుతుంది.

జొజోబా నూనె.. ఏ,బీ,సీ విటమిన్లు, జింక్‌, కాపర్‌ వంటి ఖనిజలవణాలు నిండుగా ఉండే ఈ నూనె జుట్టును పట్టుకుచ్చులా మార్చేస్తుంది. వాతావరణ మార్పులకు మాడు పొడారడం, చుండ్రు సమస్యతో శిరోజాలు రాలడం వంటి వాటికి ఇది ఔషధంలా పనిచేస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని