Published : 02/03/2023 00:10 IST

రోజంతా.. తాజాగా!

కవైపు వేడి, మరోవైపు చెమటతో చిరాకు. రోజంతా విసుగ్గా అనిపిస్తుంటే ఉల్లాసం ఎక్కడినుంచి వస్తుంది? దీన్ని తరిమికొడుతూ తాజాగా కనిపించాలనుందా? ఈ చిట్కాలు పాటించేయమంటున్నారు నిపుణులు.

* రోజుకు రెండుసార్లు స్నానం ఈ కాలం తప్పనిసరి చేసుకోండి. వేడిని తరిమికొట్టాలని పూర్తిగా చల్లటి నీటిని మాత్రం ఆశ్రయించొద్దు. చర్మం నిర్జీవంగా తయారవుతుంది. గోరు వెచ్చని నీటితో స్నానం చేసి.. చివర్లో రెండు మగ్గులు చల్లని నీరు పోసుకోండి. శరీర వేడి తగ్గడమే కాదు.. చాలాసేపు తాజా అనుభూతీ కలుగుతుంది.

* చలి లేదు.. చర్మం పగిలే సమస్య ఉండదని మాయిశ్చరైజర్‌ పక్కన పెట్టేశారా? వేడికి అతుక్కున్నట్టుగా ఉంటుందనీ కొందరు రాయడానికి ఇష్టపడరు. కానీ మాయిశ్చరైజర్‌ చర్మంలో తేమను లాక్‌ చేస్తుంది. కాబట్టి, స్నానం పూర్తవగానే తప్పక రాయాలి. సిట్రస్‌ గుణాలున్నది ఎంచుకుంటే తాజాగానూ అనిపిస్తుంది.

* చెమటకి జుట్టూ అతీతం కాదు. అదనంగా జిడ్డుగానూ మారుతుంది. స్టైల్‌ కోసమని జుట్టు విరబోయొద్దు. గడ్డిలా తయారవడమే కాదు.. మెడ మీద చెమటకీ దారితీస్తుంది. పోనీటెయిల్‌, ముడి లేదా జడలా కట్టేసుకోండి.

* ఈ కాలం ఒంట్లోని నీరంతా స్ట్రా వేసి పీల్చినట్టుగా ఆవిరై పోతుంది. కాబట్టి, ఎక్కువగా నీరు, ద్రవ పదార్థాలను తీసుకోండి. తాజా పండ్లను తరచూ తీసుకుంటుంటే తేలిగ్గా అరగడమే కాదు.. కావాల్సిన పోషకాలన్నీ శరీరానికి అంది హుషారుగానూ ఉంటారు.

*  చల్లని పదార్థాలవైపు ఈ కాలం మనసు మళ్లుతుందన్న మాట నిజమే! కానీ.. ఒత్తిడి కొద్దో, అలవాటు రీత్యానో టీ, కాఫీలు తరచూ తీసుకునేవారూ ఎక్కువే. సోడా, కూల్‌డ్రింక్‌లు, టీ, కాఫీలు శరీరాన్ని డీహైడ్రేట్‌ చేస్తాయి. పరిమితంగా తీసుకోవడమో.. వీలుంటే పూర్తిగా పక్కన పెట్టేయడమో చేయండి.

* స్టైల్‌ కంటే సౌకర్యానికి ప్రాధాన్యమివ్వండి. వదులుగా, మెత్తగా ఉన్న దుస్తులు శరీరానికి హాయిని కలిగిస్తాయి. లేత రంగులను ఎంచుకుంటే వేడిని పెద్దగా ఆకర్షించవు. దీంతో శరీరమూ చల్లబడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని