Published : 27/03/2023 00:04 IST

జిడ్డు తగ్గి చర్మం మెరిసేలా...

కాలమేదైనా చర్మం జిడ్డుగానే కనిపించడం కొందరికి పెద్ద సమస్య. వేసవి వచ్చిందంటే ఈ పరిస్థితి మరింత ఎక్కువవుతుంది. ఇలాంటప్పుడు జిడ్డు తగ్గి... ముఖం తాజాగా మెరవాలంటే ఈ చిట్కాలు పాటించి చూడండి. అందులో ఉండే ఈ పదార్థాలు మీ సమస్యను సులువుగా తగ్గించేయగలవు.

తేనె: ముఖం జిడ్డుకారుతుంటే మొటిమలూ ఇబ్బంది పెడతాయి. తేనెలో రెండు చుక్కల తులసిరసం కొద్దిగా పాలు కలిపి ముఖానికి రాసి ఆరనివ్వండి. అర్ధగంట తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయండి. ఇలా తరచూ చేస్తుంటే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

నిమ్మరసం: జిడ్డు చర్మతత్వం ఉన్నవారికి నిమ్మరసం చక్కగా పనిచేస్తుంది. ఇందులో కొద్దిగా నీళ్లు కలిపి అందులో దూదిని ఉండలుగా చేసి వేయాలి. కాసేపు ఆ ఉండల్ని ఫ్రిజ్‌లో ఉంచి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై మురికి తొలగిపోయి శుభ్రపడుతుంది. తేమ అందుతుంది జిడ్డు పేరుకోకుండా ఉంటుంది.

టొమాటోలు: విటమిన్‌ సి, సిట్రిక్‌ యాసిడ్‌ అధికంగా లభించే వాటిల్లో టొమాటో ఒకటి. జిడ్డు చర్మం కలవారు టొమాటో ముక్కపై కాస్త పంచదార చల్లి ముఖంపై మృదువుగా రుద్దాలి. పావుగంటయ్యాక చల్లటి నీళ్లతో కడిగేస్తే చర్మం తాజాగా మారుతుంది. జిడ్డు తొలగిపోతుంది.

బొప్పాయి: బొప్పాయిలో అధికంగా లభించే విటమిన్‌ ఎ, ఇతర పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా కాంతిమంతంగా మారుస్తాయి. బొప్పాయి గుజ్జులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి పూతలా వేసుకుని అరగంటయ్యాక కడిగేస్తే చాలు. జిడ్డు మాయమవుతుంది. ఇలా తరచూ చేస్తుంటే సులువుగానే జిడ్డుకి అడ్డుకట్టవేయొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని