పూలతో శిరోజాల సంరక్షణ..

నల్లని కురుల్లో పూలు తురిమితే ముఖసౌందర్యం రెట్టింపు అవుతుంది. అదే పూలతో జుట్టును ఆరోగ్యంగా ఉండేలా సంరక్షించుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

Published : 14 Apr 2023 00:06 IST

నల్లని కురుల్లో పూలు తురిమితే ముఖసౌందర్యం రెట్టింపు అవుతుంది. అదే పూలతో జుట్టును ఆరోగ్యంగా ఉండేలా సంరక్షించుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

మల్లెలు.. సుగంధభరితమైన మల్లెపూలతో శిరోజాలను మరింత ఒత్తుగా పెరిగేలా చేయొచ్చు. సహజకండిషనర్‌ గుణాలతో పొడారిన జుట్టుకు మాయిశ్చరైజర్‌లా ఇవి పనిచేస్తాయి. వీటిలో క్లెన్సింగ్‌, యాంటీ మైక్రోబియల్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. చుండ్రు దూరం చేసి, మాడును శుభ్రపరిచి, కుదుళ్లను ఆరోగ్యంగా పరిరక్షిస్తాయి. దీంతో శిరోజాలు రాలే సమస్య ఉండదు.
గోరువెచ్చని నీటిలో 15 మల్లెలను వేసి నాననివ్వాలి. ఈ నీటిని తలకు పట్టించి ఆరనిచ్చి స్నానం చేయాలి. వారానికి మూడుసార్లు మల్లె నూనె మసాజ్‌ చేస్తే  జుట్టు ఒత్తుగా మారుతుంది. శిరోజాలకు సహజ డియోడరెంట్‌గానూ పనిచేస్తుంది.


మందార.. శిరోజాలు రాలే సమస్యను దూరంచేసి, చివర్లు చిట్లకుండా కాపాడే మందారాలు బాలనెరుపును దరికి రానీయదు. ఈ పూలను మెత్తగా నూరి తలకు మాస్క్‌లా వేసి అరగంట ఆరనిచ్చి తలస్నానం చేస్తే చాలు. అలాగే మందారపూలను నీడలో ఆరనిచ్చి మెత్తని పొడిలా చేసి భద్రపరుచుకోవాలి. వారానికి రెండుమూడు సార్లు ఈ పొడికి కాస్తంత పెరుగు లేదా తేనె కలిపి తలకు పట్టించి స్నానం చేస్తే, మృదువైన శిరోజాలు సొంతమవుతాయి.


గులాబీలు.. గుప్పెడు గులాబీలను మరిగే నీళ్లలో వేసి చల్లార్చి వడకట్టి పొడిసీసాలో భద్ర పరుచుకోవచ్చు. హెయిర్‌స్ప్రేలా జుట్టుకు వారంలో నాలుగైదుసార్లు చేసి ఆరనిచ్చి తలస్నానం చేయాలి. యాంటీ ఆక్సిడెంట్స్‌, యాంటీసెప్టిక్‌, యాంటీ మైక్రోబియల్‌ ఏజెంట్స్‌ ఈ పూలల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి అదనపునూనె ఉత్పత్తిని తగ్గించి, చుండ్రును నివారిస్తాయి. పొడిబారే జుట్టు మృదువుగా మారుతుంది. గులాబీలను ఆరబెట్టి పొడిగా చేసి భద్రపరుచుకోవాలి. దీనికి కొబ్బరినూనె, గులాబీనీరు, తేనె కలిపి తలకు ప్యాక్‌గా వేసి ఆరనిచ్చి స్నానం చేస్తే చాలు. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.


రోజ్‌మెరీ.. ఈ పూల నూనె జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది. ఈ పూలను మిక్సీలో వేసి వడకట్టగా వచ్చిన రసాన్ని తలకు పట్టించి ఆరనిచ్చి స్నానం చేయాలి. మాడుపై రక్తప్రసరణ మెరుగుపడి చుండ్రు దూరమవుతుంది. శిరోజాలు ఆరోగ్యంగా పెరుగుతాయి. త్వరగా తెల్లబడకుండా చేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని