సాంత్వనకు సహజ నూనెలు!

చాలామంది మహిళలకు, ఇల్లూ కుటుంబ బాధ్యతలు మినహా మిగిలిన విషయాల్ని పట్టించుకునే తీరిక ఉండదు. ఇలారోజుల తరబడి ఒకే జీవనశైలితో గడిపితే నిరాశ, నిస్పృహ, ఆందోళన వంటివి ఇబ్బంది పెట్టొచ్చు.

Published : 04 Jul 2023 00:40 IST

చాలామంది మహిళలకు, ఇల్లూ కుటుంబ బాధ్యతలు మినహా మిగిలిన విషయాల్ని పట్టించుకునే తీరిక ఉండదు. ఇలారోజుల తరబడి ఒకే జీవనశైలితో గడిపితే నిరాశ, నిస్పృహ, ఆందోళన వంటివి ఇబ్బంది పెట్టొచ్చు. ఇలాంటప్పుడు సెల్ఫ్‌కేర్‌ చాలా అవసరం. ఇందుకోసం ఈ సహజ నూనెలు ఉపయోగపడతాయి. అదెలాగంటే...

లావెండర్‌: సరైన నిద్రలేక ఇబ్బంది పడుతున్నప్పుడు, పనుల్ని సమన్వయం చేయలేక సతమతమవుతున్నప్పుడు మెదడుని శాంతింప చేయగల శక్తి అవసరం. ఇలాంటప్పుడు లావెండర్‌ నూనెలో ముంచిన దూదిని గది మూలల్లో పెడితే సరి. ఈ సహజ పరిమళాలు గదంతా వ్యాపించి మనసుకి హాయిని కలిగిస్తాయి. లేదంటే స్నానం చేసే నీళ్లల్లో రెండు చుక్కలు కలపండి. చర్మం నిగారిస్తుంది. మనసూ తేలికవుతుంది.

యూకలిప్టస్‌:  కొబ్బరినూనెలో కొద్దిగా యూకలిప్టస్‌ నూనె కలిపి.. మాడుకు మర్దన చేయడం వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. కుదుళ్లు గట్టిపడతాయి. అలానే షాంపూలో కలిపి వాడితే కండిషనర్‌లా పనిచేస్తుంది. శిరోజాలు నిగనిగలాడతాయి. తలపై ఒత్తిడి భారమూ దిగుతుంది.

రోజ్‌వుడ్‌: ఇది సహజ యాంటీ డిప్రెసెంట్‌గా పనిచేస్తుంది. గోరువెచ్చటి నీళ్లలో నాలుగు చుక్కల రోజ్‌వుడ్‌ నూనె కలిపి స్నానం చేస్తే సరి. ఒత్తిడి దూరమవుతుంది. ఈ ఆయిల్‌ని షాంపూలో కలిపి తలస్నానం చేస్తే వెంట్రుకలకు తగిన పోషణనిస్తుంది. పొడి చర్మతత్వం ఉన్నవారు బాదం నూనెలో కలిపి ముఖానికి మర్దన చేస్తే వలయాలు దూరమై యౌవన కాంతులు సొంతమవుతాయి.

గమనిక: ఈ ఎసెన్షియల్‌ నూనెల్ని నేరుగా రాయకూడదు. బాదం, కొబ్బరి వంటి మరొక దానితో కలిపి వాడాలి. అదీ రెండు మూడు చుక్కలు మాత్రమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని