గోరింట పూసింది... అరచేతిలో
ఆషాఢంలో ప్రతి ఆడపిల్లా అరచేతుల్లో గోరింటాకు పెట్టుకుని మురిసిపోవాలనుకుంటుంది. కానీ, పెట్టుకోవడం రాక కొందరు, తీరిక లేక ఇంకొందరు... ఆ పనిని పక్కన పెట్టేస్తుంటారు.
ఆషాఢంలో ప్రతి ఆడపిల్లా అరచేతుల్లో గోరింటాకు పెట్టుకుని మురిసిపోవాలనుకుంటుంది. కానీ, పెట్టుకోవడం రాక కొందరు, తీరిక లేక ఇంకొందరు... ఆ పనిని పక్కన పెట్టేస్తుంటారు. ఇక, ఆ బాధక్కర్లేదు కోరిన డిజైన్ ఏదైనా సులువుగా పెట్టుకునేందుకు ఇప్పుడు ఎన్నో మార్గాలు ఉన్నాయి. అవేంటంటారా!
* మెహెందీ టూల్: పోట్రెయిట్ మెహెందీ ఈ మధ్యకాలంలో చాలా పాపులర్. సందర్భం ఏదైనా వధూవరుల బొమ్మలు, రాధాకృష్ణుల చిత్రాలు, ఏనుగులు, నెమళ్లు...ఇలా ఎన్నెన్నో ఆకృతుల్ని అరచేతుల్లో ఆవిష్కరిస్తున్నారు. చూడముచ్చటగా ఉండే వీటిని చిత్రకళపై పట్టున్నవారే గీయగలరని అనుకుంటాం. కానీ, మనమూ సులువుగానే వేసుకోవచ్చు. అదెలాగంటే... ఆయా ఆకృతులు ఇప్పుడు గాజు స్టాంప్ రూపంలో దొరుకుతున్నాయి. నచ్చిన దాన్ని ఎంచుకుని ఇంక్ ప్యాడ్‌లో అద్ది చేతి మీద అదిమిపెడితే చాలు... ఆ రూపం అక్కడ యథాతథంగా అచ్చయిపోతుంది. అప్పుడు ఆ నమూనా ఆధారంగా హెన్నా పెట్టుకుంటూ వెళ్తే సరి. గోరింటాకుతో అందమైన చిత్తరువులెన్నో సృష్టించేయొచ్చు.
* హెన్నా స్టెన్సిల్స్: రంగు రంగుల డిజైన్లలో గోరింటాకుని అరచేతుల్లో పండించుకోవాలని చాలామందికి ఉంటుంది. కానీ, ‘మాకు పెట్టుకోవడం రాదే’ అంటూ తెగ బాధపడిపోతుంటారు. ఇలాంటివారికి హెన్నా స్టెన్సిల్స్ భలే ఉపయోగపడతాయి. వీటిని చేతికి అతికించుకుని మెత్తగా నూరుకున్న గోరింటాకుని దానిపై పూయాలి. ఆపై అది పూర్తిగా ఎండాక తీస్తే చాలు... గోరింటాకు పూలతల్లో, ఇతర డిజైన్లలో ఎర్రెర్రగా పండి మెప్పిస్తుంది.
* బాటిల్ హెన్నా పెన్: గోరింటాకుని ఎంత మెత్తగా నూరినా... పెట్టుకోవడం రాకపోతే కాస్త మందంగా పడుతుంది. కోన్‌లా తయారు చేసుకున్నా పట్టుకోవడం వీలు లేక...ఉపయోగించలేరు కొందరు. ఇలాంటి వారికి ఈ బాటిల్ హెన్నా పెన్ భలే ఉపయోగపడుతుంది. దీన్ని కలంలా పట్టుకుని సీసా మధ్యన ఒత్తుతూ ఉంటే చాలు... సులువుగా డిజైన్ పడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.