మెటబాలిజం రేటు పెంచేద్దామిలా...

ఈ మధ్య ఆరోగ్య ప్రస్తావన వచ్చినప్పుడల్లా... ఎక్కువగా చర్చకొచ్చే అంశం మెటబాలిజం. తీసుకునే ఆహారంలోని పోషకాలని శరీరం సమర్థంగా ఉపయోగించుకుని వాటితో మనక్కావాల్సిన శక్తిని అందించడమే మెటబాలిజం.

Published : 10 Jul 2023 00:06 IST

ఈ మధ్య ఆరోగ్య ప్రస్తావన వచ్చినప్పుడల్లా... ఎక్కువగా చర్చకొచ్చే అంశం మెటబాలిజం. తీసుకునే ఆహారంలోని పోషకాలని శరీరం సమర్థంగా ఉపయోగించుకుని వాటితో మనక్కావాల్సిన శక్తిని అందించడమే మెటబాలిజం. మారిన జీవనశైలితో చాలామందిలో ఇది మందగిస్తోంది. దాని ఫలితమే ఊబకాయంతో పాటు అనేక అనారోగ్య సమస్యలు. ఇది వేగమందుకోవాలంటే...

తిండి మానొద్దు: జీవక్రియ రేటు మందగించడానికి ఆహార వేళలు పాటించకపోవడం, పోషకాహారం తీసుకోకపోవడం వంటివీ కారణాలే. ముఖ్యంగా ఉదయం అల్పాహారాన్ని దాటేయడం, డైటింగ్‌ పేరుతో పొట్ట మాడ్చుకోవడం వల్ల కావాల్సిన పోషకాలు అందవు. దాంతో శరీరం తన అవసరాల కోసం కండర కణజాలంలో ఉండే శక్తిని వాడుకుంటుంది. దీనివల్ల  మరింత బలహీనమవుతారు. ఈ పరిస్థితి దాటి జీవక్రియా రేటు బాగుండాలంటే... ఆకుకూరలూ, కాయగూరలూ, పండ్లూ, గుడ్లు, చేపలూ, నట్స్‌, చిరు, తృణధాన్యాలు... ఉండే సమతులాహారాన్ని ఎంచుకోవాలి.

నీళ్లూ తాగాలి : శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి జీవక్రియని వేగవంతం చేయడంలో నీటిది కీలకపాత్ర. రోజూ కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు  తాగగలిగితే అవయవాలన్నీ వాటి విధుల్ని అవి సక్రమంగా నిర్వర్తిస్తాయి. నిద్రా ముఖ్యమే: రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతున్నారు. ఎంత గాఢంగా కునుకు తీస్తున్నారు వంటివీ మెటబాలిజం రేటు హెచ్చు తగ్గులపై ప్రభావం చూపేవే. అందుకే నిద్రవేళల్ని పాటించాలి. షిఫ్టుల్లో పనిచేస్తుంటే కనీసం ఎనిమిదిగంటల తప్పనిసరి నిద్ర అవసరమనే విషయం మరిచిపోవద్దు. ఫలితంగా ఒత్తిడి దరిచేరదు. శరీర వ్యవస్థా సరిగా పనిచేస్తుంది.

శ్రమ ఉంటేనే: అవయవాలన్నీ సరిగా పనిచేయాలంటే వ్యాయామం తప్పనిసరి. కానీ, మారిన జీవనశైలితో ఎక్కువ సేపు కూర్చుకోవడం చాలామందికి అలవాటుగా మారింది. దీంతో మన శరీరంలో కొవ్వు కరిగించే ఎంజైమ్‌లు తగ్గిపోతాయి. జీవక్రియల రేటు తగ్గిపోతుంది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే రోజూ కనీసం నలభై ఐదు నిమిషాలు వ్యాయామానికి కేటాయించాలి. అప్పుడు ఆహారం సరిగా జీర్ణమవడమే కాదు... అదనంగా కొవ్వూ చేరదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని