వర్షాకాలంలో మాయిశ్చరైజర్‌..

చినుకులు, వాతావరణంలోని మార్పులు చర్మాన్ని బాగా ప్రభావితం చేస్తాయి. దీన్నుంచి బయటపడటానికి తగిన మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవాలంటున్నారు నిపుణులు.

Published : 22 Jul 2023 00:11 IST

చినుకులు, వాతావరణంలోని మార్పులు చర్మాన్ని బాగా ప్రభావితం చేస్తాయి. దీన్నుంచి బయటపడటానికి తగిన మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవాలంటున్నారు నిపుణులు.

చర్మం తీరును ముందుగా గుర్తిస్తేనే మాయిశ్చరైజర్‌ ఎంపిక తేలికవుతుంది. పొడి చర్మ తత్త్వం ఉన్నవారు క్రీమ్‌ మాయిశ్చరైజర్‌, జిడ్డు చర్మానికి తేలికైన క్రీం లేదా లోషన్‌ తీసుకోవడం మంచిది. ఈ కాలంలో వాతావరణంలో తేమ పెరిగి, చర్మంలో నూనె ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీంతో పొడారడం, పగుళ్లు రావడం మొదలువుతాయి. తేలికైన లేదా జిడ్డుగా అనిపించని మాయిశ్చరైజర్‌ ఈ సమస్యకు పరిష్కారాన్నిస్తుంది. ఆయిల్‌ ఫ్రీ, నాన్‌ కమెడోజెనిక్‌ ఉత్పత్తులైతే చర్మరంధ్రాలను పూర్తిగా మూసుకుపోకుండా, పొడారనివ్వకుండా ఉంచుతాయి.

తేమగా..

ముఖాన్ని మాయిశ్చరైజర్‌తో హైడ్రేట్‌ చేయగలగాలి. హైలురోనిక్‌ యాసిడ్‌, గ్లిసరిన్‌ లేదా కలబందతో తయారయ్యే ఉత్పత్తులైతే చర్మంలో ఇంకి తేమగా ఉండేలా చూస్తాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి, సి, ఇ విటమిన్లతో తయారయ్యే ఉత్పత్తులు చర్మాన్ని సంరక్షిస్తాయి. ఫ్రీరాడికల్స్‌ కారణంగా చర్మం ఆక్సీకరణ ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. దీనికి  దూరంగా ఉండాలంటే విటమిన్‌లు ఉన్న మాయిశ్చరైజర్లు తప్పనిసరి. ఈ వర్షాకాలంలోనూ యూవీ కిరణాల ప్రభావం చర్మంపై పడుతుంది. అందుకే ఎస్పీఎఫ్‌ రక్షణ ఉండే మాయిశ్చరైజర్లు ఈ సీజన్‌లో మంచిది.

అలర్జీలకు దూరంగా..

సెరామైడ్స్‌, నియాసినమైడ్‌ లేదా ఫాటీ యాసిడ్స్‌ ఉండే మాయిశ్చరైజర్‌ చర్మానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. మృదుత్వాన్ని కోల్పోనివ్వదు. పొడిబారకుండా సంరక్షిస్తూ దురద, అలర్జీ వంటి సమస్యలకు దూరంగా ఉంచుతుంది. ఇక జిడ్డుగా లేదా మొటిమలు తరచూ వచ్చే చర్మానికి జెల్‌ ఆధారిత మాయిశ్చరైజర్‌ సరైన ఎంపిక. అదనపు నూనె చేరనివ్వదు. చర్మాన్ని హైడ్రేట్‌ చేస్తుంది. వాతావరణమంతా తేమగా ఉన్నప్పుడు చర్మాన్ని తాజాగా మెరిసేలా చేస్తుంది. వర్షంలో తడిసినప్పుడు చినుకులు చర్మాన్ని మరింత సెన్సిటివ్‌గా మారుస్తాయి. ఇటువంటప్పుడు సువాసనలు, రసాయనాలు, రంగులు కలిపిన మాయిశ్చరైజర్లను ఎంచుకోకూడదు. అప్పుడే అలర్జీ, దురదకు దూరంగా ఉండొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని