ఊరు మారాక.. జుట్టు రాలుతోంది

నా వయసు 27. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌ వచ్చా. నీరు మారడం, కాలుష్యం కారణంగా జుట్టు ఊడిపోతోంది. వైద్యుల్ని కలిసి మందులు వాడినా ప్రయోజనం లేదు.

Published : 27 Jul 2023 14:32 IST

నా వయసు 27. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌ వచ్చా. నీరు మారడం, కాలుష్యం కారణంగా జుట్టు ఊడిపోతోంది. వైద్యుల్ని కలిసి మందులు వాడినా ప్రయోజనం లేదు. హెయిర్‌ స్పా కూడా ప్రయత్నించాను.  పోషకాహారం తినకపోవడమే ఇందుకు కారణం అంటున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం తీసుకోవాలి? 

- సరిత, హైదరాబాద్‌

వైద్యులు, బ్యుటీషియన్లను కలిసినా ప్రయోజనం లేదంటున్నారు. జుట్టురాలే సమస్య మొదలైనప్పుడే మంచి ఆహారం, శారీరక శ్రమ, నాణ్యమైన నిద్ర మీద దృష్టి పెట్టాలి. వైద్యపరమైన ఇతర కారణాలు ఏమీ లేనప్పుడు, ఈ మూడింటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే సమస్య నుంచి బయటపడొచ్చు. ప్రాంతం మారడం వల్ల ఈ సమస్య ప్రారంభమైంది అంటున్నారు. కానీ ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి సమస్యల వల్ల జుట్టు రాలే అవకాశాలు ఎక్కువ. వీటన్నిటిని నిలువరించడానికి ముందుగా మీ ఎత్తుకు తగ్గ బరువు ఉండేట్టు చూసుకోవాలి. దాంతో పాటు సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. ప్రొటీన్లు, మాంసకృత్తులు, పప్పులు, పాలు, పెరుగు లాంటి అమైనోయాసిడ్స్‌ ఎక్కువగా ఉండే వాటిని రోజువారీ డైట్‌లో భాగం చేసుకోవాలి. జింక్‌, బయోటిన్‌, విటమిన్లు మీ ఆహారంలో ఉన్నాయో లేదో చెక్‌ చేసుకోండి. పుట్టగొడుగులు, గసగసాలు, గడ్డి నువ్వులు, నువ్వులు, అవిసెగింజల్లో జింక్‌ ఎక్కువగా దొరుకుతుంది. పొట్టుతోఉన్న, మొలకెత్తిన తృణధాన్యాలు, నట్స్‌లో బయోటిన్‌ ఉంటుంది. గుడ్లు, తాజా కూరగాయలు, ఆకుకూరల్ని తినండి. చాలామంది జుట్టురాలే సమస్యలకు విటమిన్‌ సప్లిమెంట్లను వాడుతుంటారు. వీటివల్ల ప్రతికూల ప్రభావాలు ఎక్కువ. బరువును అదుపులో ఉంచుకోడానికి వ్యాయామాలు చేయండి. చక్కటి శారీరక శ్రమ మంచి నిద్రకు దోహదం చేస్తుంది. వీటన్నింటినీ క్రమం తప్పక పాటించాలి. అలాగని ఒకటి, రెండు రోజులు వీటిని ఫాలో అయి ప్రయోజనం లేదంటే కుదరదు. జీవన విధానంలో కనీసం మూడు నెలలు మార్పు వస్తేనే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని