ఒత్తయిన కురులకు మందారం!
మందారంలో ఉండే విటమిన్లు జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా కుదుళ్ల దృఢంగానూ మారుస్తాయి. మరి ఇందుకోసం ఏం చేయాలంటే... పది చొప్పున మందార ఆకులు, పువ్వులను తీసుకుని మిక్సీలో మెత్తగా రుబ్బి కప్పు నూనెలో వేసి మరిగించాలి. ఆపై అది సగం అయ్యాక చలారనిచ్చి ఒక గాజు సీసాలోకి తీసుకోండి.
మందారంలో ఉండే విటమిన్లు జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా కుదుళ్ల దృఢంగానూ మారుస్తాయి. మరి ఇందుకోసం ఏం చేయాలంటే...
మందార పూల నూనె: పది చొప్పున మందార ఆకులు, పువ్వులను తీసుకుని మిక్సీలో మెత్తగా రుబ్బి కప్పు నూనెలో వేసి మరిగించాలి. ఆపై అది సగం అయ్యాక చలారనిచ్చి ఒక గాజు సీసాలోకి తీసుకోండి. దీన్ని వారానికోసారైనా కుదుళ్ల నుంచి మొదళ్ల వరకూ పట్టించి అరగంట ఆగి గాఢత తక్కువ ఉండే షాంపూతో తలస్నానం చేస్తే సరి.
పెరుగు-మందార ప్యాక్: నాలుగు చొప్పున మందార పూలను, ఆకులను తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమానికి నాలుగు టీ స్పూన్‌ల పెరుగు కలిపి మాడు నుంచి చివర్ల వరకూ ప్యాక్ వేసుకోవాలి. దీన్ని ఓ గంట ఉంచి గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే సరి. జుట్టు నిగనిగలాడుతూ కనిపిస్తుంది.
మెంతితో: చుండ్రుని నివారించడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఒక స్పూన్ మెంతులు, గుప్పెడు మందారాకులు తీసుకుని మిక్సీ పట్టి, కప్పు పెరుగులో దీన్ని కలిపి కుదుళ్లకు పట్టించి ఆరనివ్వాలి. ఆపై అరగంటాగి తలస్నానం చేస్తే సరి. చుండ్రు తగ్గుతుంది.
గోరింటాకు వేసి: ఇది జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. గుప్పెడు గోరింటాకు, నాలుగు మందార ఆకులు, పువ్వులు తీసుకుని పేస్ట్‌లా చేసుకోవాలి. ఇందులో కొద్దిగా నిమ్మరసం పిండాలి. దీన్ని మొదళ్ల నుంచి కుదుళ్ల వరకూ పట్టించి గంటసేపు ఆరనివ్వాలి. సాంద్రత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే కురులు పట్టు కుచ్చులా నిగనిగలాడతాయి.
కొబ్బరిపాలు కలిపి: కప్పు కొబ్బరి పాలల్లో రెండు స్పూన్ల పెరుగు, మందార పువ్వుల పేస్ట్, నాలుగు స్పూన్ల కలబంద గుజ్జును కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి అరగంట ఆగి తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. ఇలా వారానికి రెండుసార్ల చొప్పున చేస్తే చక్కని ఫలితం ఉంటుంది.
ఉసిరి-మందార ప్యాక్: ఉసిరిలో ఉండే సి విటమిన్ జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతుంది. పావు కప్పు ఉసిరిపొడికి, ఆరుటేబుల్ స్పూన్‌ల మందార పొడి, అరకప్పు పెరుగు, రెండు స్పూన్ల పాలను కలిపి తలకు బాగా పట్టించాలి. ఆరాక గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే సరిపోతుంది. నెలలో కనీసం నాలుగుసార్లైనా ఇలా చేయడం వల్ల జుట్టు రాలే సమస్యను నియంత్రించవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.