ఫోన్‌... అందాన్ని లాగేస్తోంది!

కాల్స్, మెసేజ్‌లేమైనా వచ్చాయేమో!... బోర్‌ కొడుతోంది... కాసేపు షాపింగ్‌ చేద్దాం... ఫోన్‌ అరచేతిలోకి తీసుకోవడానికి కారణాలెన్నో. అవసరం దగ్గర్నుంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ దాకా ఏది కావాలన్నా గుర్తొచ్చేది అదే! అందుకే అరచేతిని వీడని ఆభరణమై పోయింది.

Updated : 06 Jul 2024 14:36 IST

కాల్స్, మెసేజ్‌లేమైనా వచ్చాయేమో!... బోర్‌ కొడుతోంది... కాసేపు షాపింగ్‌ చేద్దాం... ఫోన్‌ అరచేతిలోకి తీసుకోవడానికి కారణాలెన్నో. అవసరం దగ్గర్నుంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ దాకా ఏది కావాలన్నా గుర్తొచ్చేది అదే! అందుకే అరచేతిని వీడని ఆభరణమై పోయింది. సమయం గడుస్తోందని మురిసిపోతున్నాం కానీ... అది అందాన్ని లాగేస్తోందని తెలుసా?

సూర్యుడి నుంచి వచ్చే అతి నీలలోహిత (యూవీ) కిరణాలు చర్మానికి హాని చేస్తాయని తెలుసుగా? ఫోన్‌ నుంచి వచ్చే హై ఎనర్జీ విజిబుల్‌ లైట్‌... అదేనండి నీలికాంతి కూడా మనకు నష్టం కలిగించేదే. నిజానికి యూవీ కిరణాలకంటే ఈ కాంతి ఎక్కువగా చర్మలోతుల్లోకి చొచ్చుకొని పోగలదు. అంతేనా... చర్మకణాలతోపాటు సాగే గుణానికి కారణమైన కొలాజెన్‌నీ దెబ్బతీసి, త్వరగా వృద్ధాప్యఛాయలు వచ్చేలా చేస్తుంది. కొందరిలో బుగ్గలు, ముక్కుమీద నల్లని మచ్చలు వస్తాయి. హార్మోనుల్లో అసమతుల్యత, ఎండలో తిరగడం అని కారణాలు వెతుక్కుంటాం కానీ... అతిగా ఫోన్‌ చూడటం వల్ల కూడా మెలనిన్‌ ఉత్పత్తి పెరిగి ఈ పిగ్మెంటేషన్‌ ఏర్పడుతుంది. అంతేకాదు... చర్మం పొడిబారి చిట్లినట్లుగా అవుతుంది. దీంతో యాక్నే, ఎగ్జిమా వంటివి రావడానికీ దారితీస్తుంది. ఇప్పుడు పనులన్నీ ఫోన్‌తోనే. దాన్ని మానేయడం కష్టమంటారా? అయితే...

  • రెండుపూటలా ముఖాన్ని శుభ్రం చేయడం, మాయిశ్చరైజర్‌ రాయడం తప్పనిసరి చేసుకోండి. వాడే క్రీముల్లో విటమిన్‌ సి, ఇ, నియాసినమైడ్‌ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉండేలా చూసుకోండి. ఇంకా యూవీఏ, యూవీబీలతోపాటు నీలికాంతి నుంచి రక్షణనిచ్చే బ్రాడ్‌స్పెక్ట్రమ్‌ సన్‌స్క్రీన్‌ని మీ స్కిన్‌కేర్‌ రొటీన్‌లో తప్పక భాగం చేసుకోండి. దానిలో జింక్‌ ఆక్సైడ్, టైటానియం డయాక్సైడ్, ఐరన్‌ ఆక్సైడ్స్‌ వంటివి ఉంటే మేలు.
  • ఫోన్‌ చేతిలోకి తీసుకున్న ప్రతిసారీ సమయాన్ని చూసుకోండి. 20 నిమిషాలు అవుతోంది అనిపించగానే పక్కన పెట్టండి. వీలుంటే కాస్త దూరాన ఉన్న వస్తువును తదేకంగా చూస్తే మేలు. చర్మంతోపాటు కళ్లకీ హాని తగ్గుతుంది.
  • స్క్రీన్‌ ప్రొటెక్టర్‌ వేశారా? పొరపాటున ఫోన్‌ చేజారితే తెర పగిలిపోకుండా ఉంటుంది అన్నది చాలామంది ఉద్దేశం. కానీ... ఇది నీలికాంతి ప్రభావాన్ని తగ్గించడంలోనూ సాయపడుతుంది. కాబట్టి, గంటలకొద్దీ సిస్టమ్‌ ముందు పనిచేసేవారైతే వాటికీ స్క్రీన్‌ ప్రొటెక్టర్లను వేయడం మంచిది. ఇంకా తెరల నుంచి గుర్తుంచుకుని మరీ తరచూ విరామం తీసుకోవాలి. అప్పుడే అందం పదిలంగా ఉంటుంది మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్