మండే టు సండే

వారంలో ఏడురోజులపాటు వరుసగా మనం తీసుకునే ఆహారంలో పోషక విలువలు పూర్తిగా ఉండాలంటున్నారు వైద్యనిపుణులు. సోమవారం నుంచి ఆదివారం వరకు మన ప్లేట్‌లో ఏం ఉండాలన్నది చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

Updated : 19 Jun 2021 01:10 IST

వారంలో ఏడురోజులపాటు వరుసగా మనం తీసుకునే ఆహారంలో పోషక విలువలు పూర్తిగా ఉండాలంటున్నారు వైద్యనిపుణులు. సోమవారం నుంచి ఆదివారం వరకు మన ప్లేట్‌లో ఏం ఉండాలన్నది చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

సోమవారం అల్పాహారంలో చక్కెర తక్కువగా, ప్రొటీన్లు ఎక్కువగా ఉండాలి. మంచి కొవ్వు, పీచు వంటివి ఉంటే ఆ వారమంతా ఆరోగ్యంగా ఉండటానికి ప్రాథమికంగా శరీరం సిద్ధమవుతుంది. నరాల వ్యవస్థ సక్రమంగా ఉండటమే కాకుండా, కొలస్ట్రాల్‌ పెరగకుండా కాపాడుతుంది. రక్తంలో చక్కెరస్థాయులు పెరగకుండా ఉంటాయి. ఇందుకోసం ఓట్స్‌, కొబ్బరిపాలు, గుమ్మడి విత్తనాలు, జీడిపప్పులు, బాదం, ఎండుద్రాక్ష తప్పనిసరి. వీటిలో ఒత్తిడిని తగ్గించే పోషకాలు మెండుగా ఉంటాయి. వీటన్నింటితోపాటు అరగంటసేపు వ్యాయామం చేస్తే చాలు. వారాన్ని ఉత్సాహంగా ప్రారంభించొచ్చు.

మంగళవారం... హార్మోన్స్‌ను సమతుల్యం చేసే ఆహారాన్ని తీసుకోవాలి. అవకాడో, టొమాటోలు, చిలకడదుంప, చేప, కిడ్నీ బీన్స్‌, ఉల్లిపాయను చేర్చుకోవాలి. అలాగే వంటకు ఆలివ్‌నూనెను వినియోగిస్తే మంచిది. నిమ్మరసం, మిరియాలపొడి, తేనె వంటివి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి.

బుధవారం... వారంలో మధ్యన వచ్చే ఈ రోజును జీర్ణవ్యవస్థను పరిరక్షించుకోవడానికి ప్రయత్నించాలి. క్యారెట్‌ వేసిన సూప్‌తో జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ఇందులోని పీచు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. భోజనంలో క్యాలీఫ్లవర్‌, వెల్లుల్లి, నెయ్యి, ఉడికించిన తాజా కూరగాయలు తీసుకుంటే చాలు.

గురువారం... హృద్రోగాలకు దూరంగా ఉండాలంటే దానికి తగ్గట్లుగా ఆహారంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజున ఆకు కూరలు, పుట్టగొడుగులు, ఉడికించిన బీన్స్‌, చిలగడదుంపతోపాటు ఉల్లి, అల్లం, పచ్చిమిర్చి, క్యాబేజీ, బెల్‌పెపర్స్‌ భోజనంలో ఉండాల్సిందే. ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. అధిక కొవ్వు పెరగకుండా రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా చూస్తాయి.
శుక్రవారం... జీవక్రియలను సమతుల్యం చేసుకోవడానికి ఈ రోజును కేటాయించుకోవాలి. అలాగే శరీరాన్ని శక్తివంతంగా మార్చుకోవాలి. ఉదయం అల్పాహారంలో గుడ్లు, మిరియాల పొడితోపాటు తాజా కొత్తిమీర, సన్నగా తరిగిన టొమాటో, వెల్లుల్లితోపాటు చిరుధాన్యాలతో చేసిన బ్రెడ్‌ను తీసుకోవాలి. టొమాటోలోని విటమిన్‌ సి, లైకోపిన్‌ తక్షణశక్తిని అందిస్తాయి, వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.
శనివారం.... వారాంతం రోజు. ఈ సమయంలో మానసిక ప్రశాంతతను పెంచుకోవాలి. ఒమేగా-3 ఫ్యాటీయాసిడ్స్‌ పుష్కలంగా ఉండే ఆయిలీ ఫిష్‌ చాలా మంచిది. ఆకుకూరల సలాడ్‌ మరవకూడదు. అలాగే పెరుగులోని పోషకాలు వ్యాధినిరోధకశక్తిని పెంచడంతోపాటు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఆదివారం... ఈ రోజును డిటాక్సిఫికేషన్‌ కోసం కేటాయించాలి. పీచు ఎక్కువగా ఉండే బీన్స్‌, క్యారెట్‌ వంటివి తీసుకోవాలి. అలాగే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచేలా భోజనాన్ని ఎంచుకోవాలి. ద్రాక్షపండ్లు కాలేయాన్ని శుద్ధి చేస్తాయి. ఉదయం పచ్చి క్యారెట్‌ జ్యూస్‌, మధ్యాహ్నం తాజా యాపిల్‌ రసాన్ని తాగితే మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్