Updated : 12/08/2021 05:36 IST

మొటిమలకు ముల్లంగి!

విటమిన్లు, ఖనిజ లవణాలు తదితర పోషక విలువలు పుష్కలంగా ఉండే ముల్లంగి ఆరోగ్యాన్నే కాదు, అందాన్ని కూడా పరిరక్షిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా మార్చి, ముఖంపై మొటిమలను దూరం చేస్తుంది. మరి ముల్లంగినెలా ఉపయోగించుకోవాలో చూడండి...

మృతకణాలను పోగొట్టి.. చెంచా ముల్లంగి తరుగుకు అరచెంచా పెరుగు, అయిదుచుక్కల బాదం నూనెను కలిపి మిశ్రమాన్ని ముఖానికి, మెడకు లేపనంలా పట్టించాలి. పావు గంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే చాలు. ముఖచర్మం తేమగా మారుతుంది, కాంతివంతమవుతుంది.

ముల్లంగి దుంపను ముక్కలుగా కోసి మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్లు కలిపి ముఖానికి రాసి మునివేళ్లతో మృదువుగా రుద్దాలి. ఆరాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చాలు. ఇది సహజ బ్లీచింగ్‌ ఏజెంట్‌గా పనిచేసి, మొటిమలను దూరం చేస్తుంది. వాటివల్ల వచ్చే నల్లని మచ్చలు, రాషెస్‌ వంటివి మటుమాయం చేస్తుంది. ఇందులోని విటమిన్‌ సి చర్మంపై మృతకణాలను పోగొట్టి, నిత్యం మెరుపులీనేలా చేస్తుంది.

మచ్చలు దూరం.. చెంచా ముల్లంగి గుజ్జుకు అర చెంచా నిమ్మరసం, నాలుగైదు చుక్కల ఆలివ్‌ నూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసి పావుగంట ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో శుభ్రపరచాలి. నిమ్మలోని విటమిన్‌ సి చర్మాన్ని శుభ్ర పరుస్తుంది. మొటిమల మచ్చలు లేదా ఎండవల్ల కమిలిన చర్మం పూర్వపు కాంతిని సంతరించుకుంటుంది. ముల్లంగి రసంలో దూదిని ముంచి మచ్చలపై మృదువుగా రాసినా ప్రయోజనం ఉంటుంది. ఈ మిశ్రమాన్ని ముఖంపై 20 నిమిషాలు ఆరనిచ్చి చల్లని నీటితో శుభ్రపరిచి మెత్తని వస్త్రంతో అద్దితే చాలు. వారంలో నాలుగైదుసార్లు ఇలా చేస్తే మటుమాయమవుతాయి.

కాంతివంతంగా.. చెంచా ముల్లంగి రసానికి చెంచా ఓట్‌ మీల్‌ పౌడర్‌, ఎగ్‌ వైట్‌ను కలిపి ముఖానికి లేపనంలా పట్టించాలి. పావుగంట తర్వాత మృదువుగా రుద్దుతూ గోరువెచ్చని నీటితో శుభ్రపరిస్తే చాలు. మృతకణాలు పోతాయి. చర్మకణాల్లో రక్తప్రసరణ జరిగి కాంతివంతంగానూ మారుతుంది.

శిరోజాల ఆరోగ్యానికి ముల్లంగి రసంలో దూదిని ముంచి మాడుకు మృదువుగా రాసి తలకు టవల్‌ కట్టి ఓ అరగంట ఆరనివ్వాలి. తర్వాత శుభ్రం చేసుకుంటే చుండ్రుండదు. జుట్టు ఆరోగ్యంగానూ పెరుగుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని