Updated : 20/08/2021 05:58 IST

పోషకాల ప్రసాదాలు!

పండగ నాడు అమ్మవారికి చక్కెర పొంగలి, దద్ధ్యోజనం, పరమాన్నం, పులిహోర, పులగం, పూర్ణం బూరెలు, నానబెట్టిన సెనగలు.. ఇలా రకరకాల నైవేద్యాలను సమర్పిస్తాం. ఆ తర్వాత అందరికీ ప్రసాదాలుగా పంచిపెడతాం. మరి ఈ ప్రసాదాల్లో ఉన్న పోషక విలువలేంటో తెలుసు కుందామా...

పచ్చిసెనగలు... మొలకెత్తిన సెనగల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చాలా బలవర్థకం. 100 గ్రాముల సెనగల్లో 20 గ్రా. ప్రొటీన్‌, 9 గ్రా. పీచు ఉంటాయి. బి - కాంప్లెక్స్‌ విటమిన్లు, సి, ప్రొటీన్లు, ఎంజైమ్‌లు మెండుగా ఉంటాయి. పచ్చి సెనగలు తేలికగా జీర్ణమవుతాయి. ఇవి సంపూర్ణ ఆహారం. మొలకెత్తినప్పుడు వీటిలోని ఫైటేజ్‌, టానిక్‌ ఆమ్లం లాంటివి తగ్గిపోతాయి. అందులోని ఇనుము, క్యాల్షియం సులువుగా వంటబడతాయి. ఈ గింజలను నానబెట్టడం వల్ల గ్యాస్‌ కారకాలు పోతాయి. దాంతో వీటిని తిన్నా అజీర్ణం, కడుపు ఉబ్బరం, గ్యాస్‌ సమస్యలు రావు.

పులగం... ఇదీ సంపూర్ణ ఆహారమే. సమాన పరిమాణాల్లో బియ్యం, పప్పులతో తయారు చేస్తారు. దీని నుంచి ఎక్కువ మొత్తంలో కెలొరీలు /శక్తి లభిస్తాయి. తక్కువ నూనె వేసి చేస్తే పెద్ద మొత్తంలో మాంసకృత్తులు, పిండి పదార్థాలు కూడా అందుతాయి.

దద్ధ్యోజనం.. దీన్లో పెరుగు ఎక్కువగా ఉపయోగిస్తారు కాబట్టి అది మేలైన బ్యాక్టీరియాను అందిస్తుంది. తేలికగా జీర్ణమవడానికి తోడ్పడుతుంది. జీర్ణకోశానికి హాయిని కలిగిస్తుంది.

పులిహోర: ఇందులో వేసే దినుసుల వల్ల చాలా ఉపయోగాలున్నాయి. ఆకలి ఉండని వాళ్లకు దీన్ని పెడితే పుల్లపుల్లగా నోటికి రుచిని అందిస్తుంది. దాంతో ఇష్టపడి తింటారు. త్వరగా జీర్ణమవుతుంది కూడా. ఇంగువ, ఆవాలు, చింతపండు, కరివేపాకు... ఇవన్నీ ఆరోగ్యాన్నిచ్చేవే. చింత పండు నుంచి ఐరన్‌ లభిస్తుంది. ఇంగువలో ‘క్వెర్‌సెటిన్‌’ అనే యాంటీ ఆక్సిడెంట్‌ ఉంటుంది. ఇది మిగిలిన పదార్థాల్లో కంటే ఇంగువలో ఎక్కువ మొత్తంలో ఉంటుంది. మన శరీరంలో బయటి పరిస్థితుల వల్ల కొన్ని రకాల రసాయనాలు ఉత్పత్తి అయి హాని చేస్తుంటాయి. క్వెర్‌సెటిన్‌ వీటిని  నిర్మూలిస్తుంది.

పరమాన్నం (బెల్లం అన్నం)... పాలు, బెల్లం, బియ్యంలతో చేసే ఈ అన్నం ఎక్కువ కెలొరీలు ఇచ్చే సంపూర్ణ ఆహారం. ఎక్కువ మొత్తంలో ప్రొటీన్లూ లభ్యమవుతాయి. కెలొరీలు/ శక్తి చాలా ఎక్కువగా ఉంటాయి. పాలలో ఉడికిస్తారు కాబట్టి క్యాల్షియం, బి - కాంపెక్స్‌ విటమిన్లు, ప్రొటీన్లూ ఎక్కువ.

బూరెల నుంచి కూడా తగినన్ని కెలొరీలు లభ్యమవుతాయి. చివరగా ఒక్క మాట ఇన్ని రకాల నైవేద్యాలను మోతాదుకు తగ్గట్లుగా తీసుకోవాలి. వీటితోపాటు పండ్లను కూడా తీసుకోవాలి. 

- డాక్టర్‌ జానకీ శ్రీనాథ్‌, పోషకాహార నిపుణులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని