ఒత్తిడిని చిత్తు చేయాలంటే...
close
Updated : 22/09/2021 13:07 IST

ఒత్తిడిని చిత్తు చేయాలంటే...

ఇంటిపనులు, ఆఫీసు విధుల హడావిడిలో.... ఒత్తిడి తప్పదు. ఇది దీర్ఘకాలం సాగుతుంటే మాత్రం మతిమరుపూ తప్పక పోవచ్చంటున్నాయి పలు అధ్యయనాలు.

ఇవి తినండి... శరీరం చురుగ్గా ఉండేందుకు తగిన పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకుంటాం. అలానే మెదడు చురుగ్గా ఉండటానికీ ప్రత్యేక ఆహారం అవసరం. ముఖ్యంగా తక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ఉండే ఆహార పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ద్రాక్ష, అరటి, మామిడి, బొప్పాయి, ఖర్జూర, అంజీర, చేపలూ, అవిసెగింజలు వంటివి తీసుకోవాలి. వీటిల్లో ఎక్కువగా ఉండే పీచు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్‌ మానసికంగా, శారీరకంగా చురుగ్గా ఉంచుతాయి. 

పదును పెట్టండి... కత్తికి పదును అవసరమైనట్లే... మెదడు చురుగ్గా పని చేయాలంటే దానికి తగిన పని ఉండాలి. అందుకోసం పుస్తకాలు, దినపత్రికలు వంటివి చదవడం అలవాటు చేసుకోండి. ఇవి ఉత్సుకతను కలిగించడమే కాదు జ్ఞాపకశక్తిని పెంచుతాయి. పజిల్స్‌, సుడోకు వంటివన్నీ వేగంగా నిర్ణయం తీసుకునేలా చేస్తాయి.

నిద్రకావాలి... నిజానికి కొద్దిపాటి ఒత్తిడి చురుకైన ఆలోచనలకు కారణం అయినప్పటికీ దీర్ఘకాలంలో మాత్రం ఇబ్బందే. ఇలాంటి ఒత్తిడికి దూరంగా ఉండాలంటే శరీరానికి తగిన వ్యాయామం అవసరం. దానికి తోడు తగిన విశ్రాంతీ తప్పనిసరి. ఇది శరీరాన్నే కాదు మనసునీ తేలికపరుస్తుంది. ఫలితంగా చక్కటి నిద్రా మీ సొంతమవుతుంది. ఇవి ఒకదానికొకటి సహకరించుకోవడం వల్ల మెదడు పనితీరులోనూ మార్పు వస్తుంది.


Advertisement

మరిన్ని