Updated : 25/09/2021 05:45 IST

నలభైలకు తగ్గట్టుగా...

మహిళలు నలభైల్లోకి అడుగుపెడుతున్నప్పుడు పౌష్టిక విలువలున్న ఆహారానికి మరింత ప్రాధాన్యత పెంచాలి. అప్పుడే... మెనోపాజ్‌కు దగ్గర పడుతున్న సమయం వచ్చేసరికి శరీరంలో కలిగే మార్పులకు, ఎదురయ్యే కొన్ని రకాల అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చంటున్నారు వైద్యనిపుణులు. గృహిణిగా, ఉద్యోగినిగా బాధ్యతలెన్నో చేపడుతున్న నేటి మహిళ జాగ్రత్తలు తీసుకుంటేనే నిండైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని సూచిస్తున్నారు.

* జీవక్రియలు... 30 ఏళ్లు వచ్చేసరికే ముందస్తు జాగ్రత్తగా జీవక్రియలను మెరుగుపరుచుకోవాలి. ప్రొటీన్లు పుష్కలంగా ఉండే గుడ్లు, బాదం, సోయా నగ్గెట్స్‌, చికెన్‌, ఓట్స్‌, పాలు, పెరుగు, బ్రొకోలీ, చేపవంటివి తీసుకోవాలి. వీటివల్ల అధిక బరువు సమస్యకు దూరంగా ఉంటూనే, శరీరానికి తగినంత విటమిన్లు, మాంగనీస్‌, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్‌, సెలీనియం వంటి ఖనిజలవణాలు అందుతాయి. ఇవన్నీ జీవక్రియలను సమతుల్యం చేసి భవిష్యత్తులో  వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి.

* వ్యాయామం... కండరాలు, ఎముకలు బలహీనపడకుండా నిత్యం వ్యాయామం అత్యంత ముఖ్యం. వారానికి కనీసం నాలుగు రోజులు, రోజూ 30 - 40 నిమిషాలు నడక, సైక్లింగ్‌, పరుగు వంటి వాటితోపాటు కొన్నిరకాల వర్కవుట్లు చేయడం మంచిది. వారానికి ఒకసారైనా డాన్స్‌, లేదా ట్రెక్కింగ్‌, అవుట్‌డోర్‌ గేమ్స్‌ వంటివి ఎంచుకుంటే కండరాలు బలోపేతమవుతాయి. అలాగే యోగా మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.

* పీచు ఉండేలా... ఆహారంలో పీచు సమృద్ధిగా ఉండే పదార్థాలను చేర్చుకోవాలి. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరచడమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి. దీంతో 40లోపడిన తర్వాత వచ్చే మధుమేహం వంటి సమస్యలు దరికి చేరవు. పండ్లరసాలకు బదులుగా తాజా పండ్లను తీసుకుంటే శరీరానికి కావాల్సినంత పీచు అందుతుంది. కూరగాయలతో చేసే సలాడ్స్‌ ద్వారా కూడా పీచు ఎక్కువగా లభ్యమవుతుంది.

* హార్మోన్ల పనితీరు... శరీరంలో హార్మోన్ల పనితీరులో మార్పుల ప్రభావం ఈ వయసులో తీవ్ర ఒత్తిడి, ఆందోళనకు గురిచేసే ప్రమాదం ఉంది. ఆకలి కూడా తగ్గుతుంది. ఇదంతా ఆరోగ్యంపై దుష్ఫ్రభావం చూపిస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే పౌష్టికాహారాన్ని తీసుకుంటూ, ఏడాదికి కనీసం రెండు సార్లు హార్మోన్ల స్థాయి పరీక్ష చేయించుకోవడం తప్పని సరి. శారీరక, మానసిక వ్యాయామం క్రమం తప్పకుండా చేస్తుంటే, హార్మోన్ల పనితీరులో హెచ్చుతగ్గులుండవు.

* ఎముకల ఆరోగ్యం... 40 ఏళ్లు దాటుతున్నాయంటే ఎముకలు బలహీనపడటం మొదలవుతుంది. ఈ వయసులో ప్రతి మహిళకూ రోజుకి 1000 మిల్లీగ్రాములు కాల్షియం అవసరమని చెబుతున్నారు వైద్యనిపుణులు. కాల్షియం, డి విటమిన్‌ శాతం తగ్గకుండా పాలు, పెరుగు, బాదం, ఆకు కూరలు, చిక్కుడు, చేప వంటివి ఆహారంలో ఉండేలా జాగ్రత్తపడితే చాలు. ఈ వయసులో వచ్చే సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని