Published : 08/10/2021 01:12 IST

నిదురమ్మ ఎటు పోతివే..

కంటినిండా నిద్రపోవాలంటే కొన్ని అనారోగ్య అలవాట్లను వదిలేయాలి. మంచి లక్షణాలను కొన్నింటిని  నేర్చుకోవాలి. అవేంటో చూద్దామా...
కాఫీ.. నోనో.. ఎక్కువ మొత్తంలో కెఫిన్‌ రక్తంలో కలిస్తే, అదీ పడుకునే ముందు తాగితే మీ నిద్ర మొత్తం ఎగిరి పోతుంది. కాబట్టి పడుకోబోయే రెండు, మూడు గంటల ముందు నుంచి అస్సలు కాఫీ జోలికి వెళ్లొద్దు.
బ్రా వద్దు:  నిద్రబోయే సమయంలో కూడా బ్రా ధరిస్తే అసౌకర్యమే కాకుండా అనారోగ్యాలనూ తెచ్చిపెడుతుంది. కాబట్టి దాన్ని తీసేసి వదులుగా ఉండే దుస్తులు ధరించి అప్పుడు నడుం వాల్చడం మంచిది.
స్వచ్ఛమైన గాలి... ఉక్కపోతగా, వాతావరణం వేడిగా ఉన్నా నిద్రపట్టదు. ఇలాంటి సమయంలో ఏసీల్లాంటి వాటిపై ఆధారపడకుండా కిటికీలు తీసి చల్లటి గాలిని ఆస్వాదించండి. హాయిగా నిద్ర పడుతుంది.
పాలు తాగండి... నిద్రకుపక్రమించే ముందు ఓ గ్లాసు గోరువెచ్చనిపాలు తాగితే హాయిగా చంటిపాపలా నిద్రపోతారు. వెచ్చటి పాలు శరీరానికి విశ్రాంతిని కలిగించి నిద్రపట్టేలా చేస్తాయి. పాలు తాగడం ఇష్టం లేనివారు.. గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే సరి.
తలగడా సరిగా... ఇది సరిగా లేకపోయినా నిద్రకు అంతరాయం కలుగుతుంది. కాబట్టి మృదువుగా, మెత్తగా ఉండే తలగడను ఎంచుకోవాలి. అలాగే వేసుకునే తీరును సరిచూసుకోవాలి.
ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లకు దూరం.. వీటినుంచి వెలువడే నీలం రంగు కాంతి నిద్రకు దూరం చేస్తుంది. కాబట్టి మంచానికి అందనంత దూరంలో ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను ఉంచండి.
మందులు అప్పుడు వద్దు... కొన్ని రకాల ఔషధాలు నిద్ర పట్టకుండా చేస్తాయి. కాబట్టి వాటిని వీలైతే వైద్యుల సూచనల మేరకు తగ్గించుకోవడమో, కొంచెం పెందలాడే వేసుకోవడమో చేయాలి.
మెగ్నీషియం పదార్థాలు.. రాత్రుళ్లు పాలకూర, గుమ్మడి విత్తనాలు, పెరుగు, బాదం, డార్క్‌ చాక్లెట్‌ లాంటివి తీసుకోవాలి. వీటిలో మెగ్నిషియం మెండుగా ఉంటుంది. ఇది నిద్ర బాగా పట్టేలా చేస్తుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని