గర్భనిరోధకాన్ని కనిపెట్టి...

గర్భాశయంలోకి ప్రవేశించిన వీర్యాన్ని అక్కడికక్కడే నిర్వీర్యం చేసే గర్భనిరోధకాన్ని రూపొందించింది మైక్రోబయాలజిస్టు భావనాశ్రేష్ట.

Updated : 10 Oct 2021 06:03 IST

గర్భాశయంలోకి ప్రవేశించిన వీర్యాన్ని అక్కడికక్కడే నిర్వీర్యం చేసే గర్భనిరోధకాన్ని రూపొందించింది మైక్రోబయాలజిస్టు భావనాశ్రేష్ట. ఈమె చేసిన ఈ పరిశోధన మానవాళికీ ఉపకరిస్తుందన్న నేపథ్యంలో ఆసక్తికరమైన విషయాలివి..

దిల్లీకి చెందిన భావనాశ్రేష్ట క్లాఫిన్‌ యూనివర్శిటీలో బయోకెమిస్ట్రీలో డిగ్రీ చేసింది. క్లోమగ్రంథి క్యాన్సర్‌ని నిరోధించే బీ సెల్స్‌ నియంత్రణకు నిర్వహించిన పరిశోధనలో భాగస్వామురాలిగా పనిచేస్తూనే, నార్త్‌ కరోలినా యూనివర్శిటీలో పీహెచ్‌డీ, మరోవైపు ఛాపెల్‌హిల్‌లో గ్రాడ్యుయేట్‌ రీసెర్చి స్టుడెంట్‌గా పలు పరిశోధనలూ చేపడుతోంది. అందులో భాగంగానే వీర్యాన్ని నిర్వీర్యం చేసే దిశగా ఈమె చేపట్టిన అధ్యయనాలు, ప్రపంచానికి ఉపయోగకరం కాబోతున్నాయి. ఈమె రూపొందించిన ప్రతిరోధకాన్ని మొదట జంతువులపై ప్రయోగించగా 99.9శాతం విజయవంతమైంది. దీంతో దీన్ని మనుషులు వినియోగించడానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలుసుకోవడానికి క్లినికల్‌ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. ఈమె చేపడుతున్న ఈ పరిశోధనా ఫలితాలు ఇటీవల ‘సైన్స్‌ ట్రాన్‌స్లేషనల్‌ మెడిసిన్‌’ జర్నల్‌లో కూడా ప్రచురితమయ్యాయి.

ఆసక్తి తక్కువ...
సంతాననిరోధకాన్ని వినియోగించడానికి చాలామంది మహిళలు ముందుకురారు అని అంటోంది భావన. ‘పిల్లలు పుట్టకుండా ఉండటానికి మాత్రలు వాడాలంటే చాలామంది ఆసక్తి చూపించరు. ఎందుకంటే వాటివల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావాలుంటాయని భయపడతారు. అంతేకాదు, వీటిని వినియోగించిన తర్వాత శాశ్వతంగా సంతానసాఫల్యత తగ్గుతుందని అపోహపడతారు. కొన్నిరకాల మాత్రల వల్ల రుతుస్రావంలో మార్పులు, ఒత్తిడి, అధికబరువు, మైగ్రేయన్‌ వంటివి ఎదురవుతాయి. ఇటువంటి సమస్యలు లేకుండా, గర్భనిరోధకాన్ని కనిపెట్టాలని ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ కోణంలోనే నేనూ పరిశోధనలు నిర్వహించా. అమెరికాలో కొందరు మహిళలను పరిశీలించినప్పుడు గర్భాశయానికి సంబంధించి వారికి ఎటువంటి అనారోగ్యాలు లేవు. వారి భర్తలకూ ఆరోగ్యసమస్యల్లేవు. అయినా వారికి సంతానం కలగకపోవడం గుర్తించా. పరిశీలనలో ఆ మహిళల గర్భాశయంలోని కొన్ని యాంటీబాడీస్‌ వీర్యాన్ని ఫలదీకరణం చెందకుండా అడ్డుకుంటున్నాయని తేలింది. ఇది నన్ను ఆలోచించేలా చేసింది. అటువంటి యాంటీబాడీస్‌నే తయారుచేయగలిగితే నా పరిశోధనకు ఫలితం దక్కుతుందని అనిపించింది. ప్రయోగాలు మొదలుపెట్టా. అత్యంత శక్తివంతమైన వీర్యాన్ని సేకరించి, నేను రూపొందించిన యాంటీబాడీని అటాచ్‌ చేసి, గర్భాశయంలోకి పంపించగా, అది అండంతో కలిసేలోపే నిర్వీర్యం అయ్యింది. దీన్ని పలు జంతువులపై ప్రయోగాత్మకంగా పరిశీలిస్తే విజయవంతమైంది’ అని చెబుతున్న భావన ఎలుకవల్ల సోకే వైరస్‌ను ఎదుర్కొనే వ్యాధినిరోధక శక్తిపై, యాంటీ హెచ్‌ఐవీపైనా అధ్యయనం చేస్తోంది. ఇప్పుడీమె అమెరికన్‌ కెమికల్‌ సొసైటీ ఛాప్టర్‌ స్టూడెంట్‌ మెంబర్‌గానూ వ్యవహరిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్