Published : 13/10/2021 01:34 IST

అంత ఆలోచించొద్దు

పిల్లలు, వాళ్ల ఆరోగ్యం గురించి మామూలుగానే మహిళలు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఈ తీరు వాళ్లలో కరోనా తర్వాత ప్రతి విషయంలోనూ కనిపిస్తోందని చెబుతున్నాయి కొన్ని అధ్యయనాలు. ఇది కెరియర్‌కీ, ఆరోగ్యానికీ రెంటికీ మంచిది కాదంటున్నారు నిపుణులు. బయటపడటానికి సూచనలూ ఇస్తున్నారిలా!

లోచించే విషయం మీ చేతుల్లో ఉన్నదైతే సరే.. లేదంటే దాని గురించి వదిలేయండి. నిర్ణయం మీదే అయితే.. లాభాలు, నష్టాల వరకూ బేరీజు వేసుకుంటే చాలు. అన్నింటికీ తొందరపడకూడదన్నది నిజమే కానీ.. మరీ ఆలస్యం చేసినా ప్రయోజనముండదు. కాబట్టి, ఇంతలా ఆలోచించడం మంచిదేనా అని మీకు మీరే ప్రశ్నించుకోండి. అయినా పరిష్కారం కనుక్కోలేక పోతున్నారనిపిస్తే ఆ నైపుణ్యాలను నేర్చుకోవడంపై దృష్టిపెట్టండి. పజిల్స్‌, కొన్ని రకాల ఆటలు ఆ లక్షణాన్ని మీలో పెంపొందిస్తాయి. సంస్థ ఆదరించే నైపుణ్యాల్లో ఇదీ ఒకటి.

ఆఫీసులో మీ పని మీ చేతిలో ఉంటుంది. పూర్తిచేయడం వరకూ బాధ్యతగా చేస్తే చాలు. మీ పరిధిలో లేని విషయాలను వదిలేయడమే మంచిది. అనవసరంగా కంగారు పడుతున్నట్లు అనిపిస్తే వేరే వ్యాపకాలను అలవాటు చేసుకోండి. కొత్త పరిచయాలు, కొత్త అలవాట్లు మనసును మళ్లిస్తాయి. అన్ని పనులూ అందరికీ సులువు కాదు. మీ విషయంలోనూ అంతే. ఇతరులకు కష్టంగా అనిపించింది మీకు చేయగలరనిపిస్తే నిర్భయంగా స్వీకరించండి. ఎదుటివాళ్లు నవ్వుతారనో, చిన్నచూపు చూస్తారనో భావించనక్కర్లేదు. కనీసం ప్రయత్నించండి. వాళ్ల భయాన్ని మీకు ఆపాదించుకుని వెనకడుగు వేయాల్సిన పనిలేదు. విజయవంతమైతే మీకే గుర్తింపు.

పొరబాట్లు జరిగినా కంగారు పడకండి. నేర్చుకునే విధానంలో ఇదీ ఓ భాగం. కంగారు పడకుండా దాన్ని స్వీకరించడం అలవాటు చేసుకోండి. భయం వేయడం సహజమే. దాన్నే కొనసాగిస్తే ఒత్తిడితోపాటు ఇబ్బంది పడేదీ మీరే. దీర్ఘశ్వాస తీసుకుని ఆపై ఏం చేయాలో స్థిమితంగా ఆలోచిస్తే సులువుగా పరిష్కారం దొరుకుతుంది. ఎంత ప్రయత్నించినా బయటపడలేక పోతున్నారంటే దగ్గరి స్నేహితులతో పంచుకోండి. ముందు మనసు తేలికపడుతుంది. వాళ్లూ తగిన సూచనలివ్వగలుగుతారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని