పోషకాల పొడులు..

నవరాత్రుల తర్వాత పదోరోజైన దసరా ఎంత ప్రముఖమో.. తెలంగాణలో తొమ్మిదోరోజు చేసే సద్దుల బతుకమ్మకీ అంతే ప్రాధాన్యముంటుంది. మహిళలు ఆ రోజంతా ఉపవాసముండి సాయంత్రం సత్తుపిండి పేరుతో ఐదు రకాల పొడులను తయారు చేస్తారు. పూర్తిగా ఎండు వాటినే ఉపయోగించే వీటిలో పోషకాలూ బోలెడు.

Updated : 30 Aug 2022 16:18 IST

నవరాత్రుల తర్వాత పదోరోజైన దసరా ఎంత ప్రముఖమో.. తెలంగాణలో తొమ్మిదోరోజు చేసే సద్దుల బతుకమ్మకీ అంతే ప్రాధాన్యముంటుంది. మహిళలు ఆ రోజంతా ఉపవాసముండి సాయంత్రం సత్తుపిండి పేరుతో ఐదు రకాల పొడులను తయారు చేస్తారు. పూర్తిగా ఎండు వాటినే ఉపయోగించే వీటిలో పోషకాలూ బోలెడు.

* మక్కలు... 100 గ్రా. మక్కలకి 75 గ్రా. బెల్లాన్ని తీసుకోవాలి. మొక్కజొన్న గింజలను వేయించి పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమానికి తరిగిన బెల్లాన్ని జోడిస్తే... మక్క పిండి.

* పల్లీలు... 100గ్రా. పల్లీలకు 50 గ్రా. బెల్లాన్ని తీసుకోవాలి. పల్లీలను వేయించి చల్లారాక పొడికొట్టి, తురిమిన బెల్లం కలుపుకోవాలి.

* ఎండుకొబ్బరి... 100గ్రా. ఎండు కొబ్బరికి 100 గ్రా. బెల్లం అవసరం. ఎండు కొబ్బరి ముక్కలను పొడి కొట్టి, దానికి బెల్లం కలిపితే సరి.

* నువ్వులు... 100గ్రా. నువ్వులకు బెల్లం 50గ్రా. పడుతుంది. నువ్వులను వేయించి, చల్లారాక పొడి చేసుకోవాలి. దానికి బెల్లం తురుము చేర్చాలి.

* జొన్నలు... దీనికి 100 గ్రా. జొన్నలు, 75 గ్రా. బెల్లం కావాలి. వేయించి, పొడికొట్టుకున్న జొన్నపిండికి తురిమిన బెల్లాన్ని కలిపితే చాలు.

బెల్లంలో మినరల్స్‌, ఐరన్‌, ఫాస్ఫరస్‌ గుణాలెక్కువ. ఇవి హిమోగ్లోబిన్‌ ఉత్పత్తిని పెంచి, ఎనీమియాను దూరం చేస్తాయి. ఇమ్యూనిటీనీ పెంచుతాయి. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులను అదుపు చేసి బరువు పెరగకుండా ఆపుతాయి.

మొక్కజొన్నలో అధిక మోతాదులో ఫోలిక్‌ ఆసిడ్‌ ఉంటుంది. గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు ఇది చాలా మంచిది. విటమిన్‌ సి, యాంటీఆక్సిడెంట్లతో పాటు బి, ఇ, కె విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్‌ ఎక్కువ. ఇవి కణాల పునరుద్ధరణకు సాయపడటమే కాక క్యాన్సర్‌, గుండెజబ్బు, టైప్‌2 మధుమేహాన్ని దరికి చేరనివ్వవు. చర్మం, ఎముకలు, కేశాలు అన్నింటి పోషణకూ కొబ్బరిలోని మినరల్స్‌ సాయపడతాయి. మెదడు ఆరోగ్యానికి తోడ్పడటమేకాదు.. అల్జీమర్స్‌నూ దరి చేరనివ్వదు. రక్తహీనతపై పోరాడుతుంది. నువ్వుల్లోని ఒమెగా ఫ్యాటీ యాసిడ్లు కేశ పోషణలో సాయపడతాయి. చర్మ ఆరోగ్యంలోనూ వీటిది ప్రధాన పాత్రే. ఫైబర్‌ జీర్ణ క్రియను వేగవంతం చేయడంతోపాటు ఎముకలనూ దృఢపరుస్తుంది. ఒత్తిడి, ఆందోళనలనూ దూరంగా ఉంచుతుంది. జొన్నల్లో గ్లూటెన్‌ ఉండదు. అధిక మొత్తంలో ఉండే ఫైబర్‌, ప్రొటీన్‌ అధిక బరువు, మధుమేహం, రక్తపోటులను దూరంగా ఉంచుతుంది. దీనిలో ఐరన్‌, విటమిన్‌ సి, బి, కె, జింక్‌, ఐరన్‌తోపాటు 20కిపైగా మైక్రోన్యూట్రియంట్లు, యాంటీఆక్సిడెంట్లు, క్యాల్షియం ఉంటాయి. ఇవి కొత్త కణాల ఉత్పత్తి, ఎముకలు దృఢంగా అవడం, గుండె ఆరోగ్యానికి సాయపడటంతో పాటు జీర్ణక్రియనూ మెరుగుపరుస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్