Published : 18/10/2021 00:58 IST

ఫిట్‌గానే ఉన్నారా?

నెలకో రెండు నెలలకో బరువు చూసుకుంటాం. బరువు అదుపులో ఉందనిపిస్తే మన ఫిట్‌నెస్‌కి వచ్చిన ఇబ్బందేమీ లేదులే అనుకుంటాం. నిజానికి మన ఫిట్‌నెస్‌కి బరువు ఒక్కటే ప్రామాణికం కాదు...

ఆయాసం వస్తోందా...

రెండు అంతస్తులు ఎక్కినా, రెండు కిలో మీటర్లు నడిచినా ఆయాసం వస్తోందా? అయితే మీరు అన్‌ ఫిట్‌! 200 మీటర్లు నడవడానికి ఆరునిమిషాలూ, ఆపైన పడుతుంటే ఆలోచించుకోవాల్సిందే.

సౌకర్యంగా కదులుతున్నారా... మన కండరాల్లో పట్టేసినట్టుగా కాకుండా కొంత సడలింపు ఉండాలి. ఈ సడలింపు వల్లే ఒక్కోసారి తూలినా సర్దుకోగులుగుతాం. ప్రతి కండరానికి ఈ సాగే గుణం ఎంతుంది అనేది వైద్యులు నిర్ధరిస్తారు. మనకీ కొంత అవగాహన రావాలంటే నేలమీద పడుకుని కాళ్లు రెండూ నెమ్మదిగా పైకి లంబకోణంలోకి వచ్చేంత వరకూ ఎత్తాలి. ఇలా సునాయాసంగా ఎత్తగలుగుతున్నామంటే కండరాలకు సాగే గుణం బానే ఉన్నట్టు.

భుజాలు సాగుతున్నాయా?: మోకాళ్లు మడిచి వాటిపై కూర్చున్నప్పుడు పిరుదులు.. మడమలని తేలిగ్గా తాకగలగాలి. వెన్నెముక, మెడా నిటారుగా ఉంచి నిలబడాలి. ఇప్పుడు ఎడమ చేతిని ముందుకు చాపి.. కుడిచేతిని ఎడమ చేతి కింద నుంచి పైకి పెట్టడానికి ప్రయత్నించాలి. దీనివల్ల భుజాల్లో సాగే గుణం ఎంతుందో తెలుస్తుంది.

ఎగిరి చూడండి: కింద నుంచి పైకి నిటారుగా 20 సార్లు ఎగరాలి. అప్పుడు మరీ ఎక్కువ ఆయాసపడిపోకుండా ఉండాలి. కాళ్లు ఎగరడానికి సహకరించాలి. అప్పుడు కాలికండరాల సత్తువ తెలిసిపోతుంది.

మహిళల్లో కొవ్వుశాతం 15 - 18 మధ్యలో ఉండాలి. దీంతోపాటూ... పించ్‌ టెస్ట్‌ చేసి చూడండి... అంటే చర్మాన్ని గిల్లినట్టుగా కాకుండా లాగడానికి ప్రయత్నించాలి. కాలూ, తొడా, నడుమూ, పొట్టా ఇలా కొవ్వు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో లాగి చూస్తే రెండు అంగుళాల కంటే ఎక్కువగా చర్మం చేతికి దొరకకూడదు. అంతకంటే ఎక్కువగా చేతికి చిక్కుతుంటే వైద్యుల్ని కలవాల్సిందే.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని