ఆరోగ్యానికి ఆరు సూత్రాలు

ఆరోగ్యమే మహాభాగ్యం.. అది మన చేతుల్లోనే ఉంటుంది అని పెద్దలు చెబుతుంటే అదేదో అరిగిపోయిన రికార్డులా ఉంటుందే తప్ప దాని గురించి పెద్దగా ఆలోచించం.

Updated : 02 Nov 2021 06:01 IST

ఆరోగ్యమే మహాభాగ్యం.. అది మన చేతుల్లోనే ఉంటుంది అని పెద్దలు చెబుతుంటే అదేదో అరిగిపోయిన రికార్డులా ఉంటుందే తప్ప దాని గురించి పెద్దగా ఆలోచించం. ఏవేవో శారీరక, మానసిక సమస్యలు వచ్చిపడ్డాక ఆ మాటలు అక్షరసత్యాలని గుర్తించినా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందమవుతుంది. కాబట్టి ముందుగానే జాగ్రత్తపడదాం..
* ఇడ్లీని ఆరోగ్యకరమైన ఆహారంగా ప్రపంచ దేశాలెన్నో ఆమోదించాయి. పూరీ, దోసెల్లాంటి నూనెపదార్థాలకు బదులు నెలలో ఎక్కువ రోజులు అదే తినండి. విసుగనిపించినప్పుడు మొలకెత్తిన గింజల్లో కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే సరి.. భోజనవేళ వరకూ దండిగా ఉంటుంది. పోషకాలన్నీ అందుతాయి.
* మామూలుగా గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. మనం ఉద్రేకాలకు లోనైనా, ఆందోళన చెందినా ఆ ఒత్తిడి మెదడు, హృదయం మీద పడి హైపర్‌ టెన్షన్‌, గుండెపోటు వచ్చే అవకాశముంది. ప్రశాంతత చాలా చాలా అవసరం. మనశ్శాంతిని హరించే ఆవేశకావేశాలను అటకెక్కించేసి ఎన్నడూ దించకండి.
* పనసకాయ బిర్యానీ అయినా, తోటకూర పులుసయినా ఇష్టంగా తినండి. అప్పుడే అది చక్కగా ఒంటబడుతుంది. ఎలాంటి మనస్తత్వాలూ పరిస్థితులనయినా అర్థం చేసుకుని సర్దుకుపోవడానికి ప్రయత్నించండి. అప్పుడిక ఆందోళనలకి తావే లేదు.
* మూడు తెల్లటి పదార్థాలు విషంతో సమానమని గుర్తుంచుకోండి. అవును.. ఉప్పు, పంచదార, మైదాపిండి.. ఈ మూడింటినీ ఆమడ దూరం పెట్టండి.
* రోగనిరోధక శక్తిని పెంచే పండ్లూ, కూరగాయలూ తినండి. ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే సొంత వైద్యాలు మాని వైద్యులను సంప్రదించండి. ఏమైనా తేడా ఉంటే చికిత్స చేయించుకోవచ్చు, లేదని తెలిస్తే మరింత సంతోషమేగా.
* మంచి పోషకాహారం తినాలి, తగినంత వ్యాయామం చేయాలి, అలసట తీరేలా నిద్రపోవాలి. వంటావార్పూ, ఉద్యోగ బాధ్యతలతోనే గడిచిపోతుంది, ఇంకెక్కడ తీరికా ఓపికా అనుకోకుండా రోజులో కనీసం గంటసేపు బొమ్మలు గీయడం, సంగీతం, సేవా కార్యాక్రమాల్లాంటి మీకు ఇష్టమైన వ్యాపకం కోసం ఖర్చుపెట్టండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్