Updated : 06/11/2021 23:44 IST

ఈ కాలం.. కాస్త జాగ్రత్త!

చలికాలం మొదలైపోయింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే చిన్నా పెద్దా, అందరూ జబ్బు పడే ప్రమాదముంది. కాబట్టి పోషకాహారం, మెరుగైన జీవనశైలి పద్ధతులు పాటించాల్సిందే. ఇమ్యూనిటీనీ పెంచుకోవాల్సిందే. అందుకు ఏం చేయాలంటే...

వెచ్చగా.. ఈ కాలంలో శరీరం ఎప్పుడూ వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. అందుకోసం శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు వేసుకోవాలి. ఇలా చేస్తే జలుబు, దగ్గు, జ్వరం లాంటి వాటిని దూరం పెట్టొచ్చు.

సూర్యరశ్మి తాకేలా.. రోజూ ఉదయం కనీసం 20 - 30 నిమిషాలు ఎండలో కూర్చోవాలి. ఇలా చేస్తే శరీరం వెచ్చగా ఉండటంతోపాటు కావాల్సిన విటమిన్‌-డి కూడా అందుతుంది.

ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలున్న ఆహారం.. చలికాలంలో జలుబు, దగ్గు, కీళ్ల నొప్పులు ఎక్కువగా బాధిస్తాయి. వీటిని ఎదుర్కోవాలంటే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలున్న ఆహారాన్ని రోజూ తీసుకోవాలి. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. కాబట్టి రోజూ ఎండుఫలాలు, అవిసె గింజలు, పొద్దు తిరుగుడు గింజలు, చేపలను తింటే సరి.

పండ్లు, కూరగాయలు.. ఈ కాలంలో వీటిని ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. వీటిలో పోషకాలతోపాటు యాంటీఆక్సిడెంట్‌ సమ్మేళనాలు, విటమిన్‌ ఎ, బి, సిలు మెండు. పీచు, క్యాల్షియం కూడా అధికమే. పండ్లు, తాజా కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల జీవ క్రియలు సాఫీగా సాగడమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది కూడా.

నీళ్లు ఎక్కువగా... ఈ కాలంలో చాలామంది నీళ్లను తక్కువగా తాగుతారు. ఇలా చేయడం వల్ల రోగనిరోధక శక్తి, జీర్ణవ్యవస్థ బలహీనమవుతాయి. ఇవి ఆరోగ్యంపై దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే చర్మం, జుట్టుపై కూడా. అలా జరగకుండా ఉండాలంటే సమృద్ధిగా నీళ్లు తాగాల్సిందే. వీలైతే గోరు వెచ్చని నీళ్లు తాగడం మరీ మంచిది. ఇవి శరీరంలోని మలినాలను బయటకు పంపుతాయి. ఈ సమయంలో వేడి వేడి సూపులు, హెర్బల్‌ టీలు తాగితే శరీరానికి కావాల్సిన నీరు అందుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని