వర్ణాల్లో ఆరోగ్యం..

ప్రకృతిలోని వర్ణాలన్నీ కంటికింపుగా మనసుకు నిండుగా అనిపించడమే కాదు, ఆరోగ్యాన్నీ అందిస్తాయంటున్నారు వైద్యనిపుణులు. కూరగాయలు, పండ్ల వర్ణాల్లో శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు, పోషకవిలువలు పుష్కలంగా ఉంటాయంటున్నారు.

Updated : 11 Nov 2021 06:22 IST

ప్రకృతిలోని వర్ణాలన్నీ కంటికింపుగా మనసుకు నిండుగా అనిపించడమే కాదు, ఆరోగ్యాన్నీ అందిస్తాయంటున్నారు వైద్యనిపుణులు. కూరగాయలు, పండ్ల వర్ణాల్లో శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు, పోషకవిలువలు పుష్కలంగా ఉంటాయంటున్నారు. అందుకే ప్లేటులో ఆహారం సప్తవర్ణాలతో ఇంద్రధనస్సులా ఉంటే పండంటి ఆరోగ్యం మనసొంతమని సూచిస్తున్నారు.

* ఎరుపు.. టొమాటో, బెల్‌పెప్పర్‌, దానిమ్మ, పుచ్చ, ఎరుపుద్రాక్ష తదితరాల్లో ఉండే ఎరుపు వర్ణంలో యాంటీ ఆక్సిడెంట్స్‌, ఏ, సీ విటమిన్లు, మాంగనీస్‌, పీచు, లైకోపిన్‌ వంటివి ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు, దగ్గు, జ్వరం, అలర్జీలతో పోరాడతాయి.


* నారింజ.. చిలగడ దుంప, క్యారెట్‌, నారింజ, గుమ్మడి, ఆరెంజ్‌ వంటి వాటిలో యాంటీఆక్సిడెంట్లు నిండుగా ఉంటాయి. వీటిలోని ఏ, సీ విటమిన్లు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. పొటాషియం, పీచు, బి6 విటమిన్‌ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. క్యారెట్లోని బీటా కెరొటిన్‌ కంటి సమస్యలను దరిచేరనివ్వదు.


* పసుపు.. అరటిపండు, గుమ్మడి, మొక్కజొన్న, దోసలోని పొటాషియం, విటమిన్‌ ఏ, బీ6, మాంగనీస్‌, పొటాషియం, మెగ్నీషియంలు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. కండరాలను బలోపేతం చేస్తాయి.


* ఆకు పచ్చ... ఆకుకూరలు, బ్రకోలీ వంటి వాటిలోని పోషకాలు నేత్రాలను పరిరక్షిస్తాయి. రోజూ తీసుకునే ఈ వర్ణంలోని కూరగాయలు, పండ్లు ఆరోగ్యంగా ఉంచుతాయి.


* నీలం... ద్రాక్ష, నేరేడు వంటి వాటిలో ఉండే విటమిన్లు, ఖనిజ లవణాలు శరీరానికి పోషకాలను అందిస్తాయి. నీటి శాతాన్ని అదుపులో ఉంచుతాయి. రక్త కణాలకు కావాల్సిన ఆక్సిజన్‌ను సరఫరా చేయడంలో దోహద పడతాయి.

వ్యర్థాలను బయటకు పంపుతాయి. కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.


* ఊదా.. వంకాయ, ద్రాక్ష, ప్లమ్స్‌, క్యాబేజీ, బీట్‌రూట్‌లో విటమిన్లు ఫ్లెవనాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. శరీరంలో రక్తాన్ని సరఫరాచేసే నాళాల్లో కొవ్వు పేరు కోకుండా రక్షిస్తాయి. చర్మ ఆరోగ్యాన్నీ పరిరక్షిస్తాయి.


* తెలుపు... వెల్లుల్లి, ఉల్లి, క్యాలీఫ్లవర్‌, ముల్లంగి, బంగాళా దుంపలో విటమిన్‌ సి, కే, ఫొలేట్‌, పీచుతోపాటు పలురకాల పోషకవిలువలు ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచి వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. వీటిలోని సల్ఫర్‌ హృద్రోగాలను దరిచేరనివ్వదు.


 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్