Updated : 12/11/2021 05:39 IST

కోపాన్ని జయిస్తే...

రమణికి ప్రతి చిన్న విషయానికి కోపం వచ్చి గట్టిగా అరుస్తూ ఉంటుంది. దీంతో భర్త, పిల్లలు ఆమెతో మాట్లాడటానికే భయపడుతుంటారు. బంధువులు, స్నేహితులు కూడా ఆమెకు దూరం జరుగుతున్నారు. తన కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలో తెలియక, మనసుకు నచ్చినవారంతా తనకు దూరమవుతుంటే తీవ్ర వేదనకు లోనవుతోంది. ఇలా కోపాన్ని తగ్గించుకోలేని వారు జీవితంలో విలువైనవి చాలా కోల్పోవలసి ఉంటుందని హెచ్చరిస్తున్నారు మానసిక నిపుణులు. ఈ సమస్యకు పరిష్కారాలనూ సూచిస్తున్నారు.

* ముందుగా... అవతలివారి అభిప్రాయానికి విలువనివ్వనప్పుడు, ముందున్న వారికి చెప్పడానికి సమాధానం లేనప్పుడు లేదా ఏం చెప్పాలో తెలియని సందర్భాల్లో కోపం రావడానికి అవకాశం ఎక్కువ.  ఆ సమయంలో వెంటనే నోటికొచ్చినట్లుగా మాట్లాడకుండా ఆ సందర్భమేంటో ఆలోచించాలి. ఎదుటి వ్యక్తి అభిప్రాయంతో ఏకీభవించలేకపోతే నిశ్శబ్దంగా ఉండటం మంచిది. వీలైతే అక్కడి నుంచి దూరంగా జరగాలి. కొన్ని క్షణాలు గడిచిన తర్వాత  తీవ్రతతో పాటు కోపం కూడా కాస్తంత తగ్గుతుంది. అప్పుడు మనసులోని మాటను చెప్పడానికి ప్రయత్నించాలి.

* వ్యాయామం... కోపం తీవ్రంగా వచ్చినప్పుడు వేగంగా కొంత దూరం అడుగులు వేయడం లేదా ఏదైనా పనిలోకి మనసును మళ్లించుకోవడం సాధన చేయాలి. ఇష్టమైన చిత్రలేఖనం, పుస్తక పఠనం, మనసుకు నచ్చిన వంటకం తయారు చేయడం వంటివి కోపం నుంచి కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఎదుటివారిపై మాటలతో దాడి చేయకుండా కోపం నియంత్రణలోకి వస్తుంది. స్వీయ అభ్యాసం చేస్తే దీన్ని జయించొచ్చు.

* కారణం... మానసిక ఒత్తిడి, ఆందోళన, అనారోగ్యం వంటివి కోపానికి కారణాలవుతాయి. వీటిని ముందుగా గుర్తించగలగాలి. ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. పోషకాహారాన్ని తీసుకోవాలి. రోజుకి కనీసం ఏడు గంటల నిద్ర, ఆరేడు గ్లాసుల మంచినీటిని తాగడం వంటి అలవాట్లతో ఆరోగ్యాన్ని పొందితే కొంతవరకు కోపానికి దూరంగా ఉండొచ్చు. సమస్యలను పరిష్కార కోణంలో ఆలోచించాలి. అరవకుండా మృదువుగా చర్చిస్తే అవతలి వారూ అదే స్థాయిలో మాట్లాడతారు.

* క్షమించడం... ఎదుటివారి ప్రవర్తన, నిర్లక్ష్యం వంటి అంశాలు కోపానికి దారి తీస్తాయి. విడమర్చి వారికి చెప్పడం, అవతలి వారిని క్షమించడం నేర్చుకోవాలి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో వీలైనంత మృదువుగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తే మానవ సంబంధాలు ధృఢంగా ఉంటాయి. కుటుంబంతో బయటకు వెళ్లడం, పిల్లలతో ఎక్కువ సమయం గడపడం వంటివన్నీ చేస్తే... ఇల్లే స్వర్గసీమ అవుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని