నిద్రలేమితో తగ్గే పఠన సామర్థ్యం
close
Updated : 13/11/2021 05:59 IST

నిద్రలేమితో తగ్గే పఠన సామర్థ్యం

చిన్నారులు నిద్రకు దూరమైతే... వారిలో చదువుపై ఆసక్తి తగ్గడమే కాదు, పఠన సామర్థ్యంలోనూ సమస్యలు ఎదురవుతాయంటున్నారు శాస్త్రవేత్తలు. దీనిపై అధ్యయనం బ్రిటిష్‌ జర్నల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ సైకాలజీలో ప్రచురితమైంది. అందులో అంశాలేంటంటే...

నిద్రలేమి వల్ల సమస్యలను తెలుసుకోవడానికి 4 నుంచి 14 ఏళ్లలోపు ఉన్న 339 మంది చిన్నారులను ఎంచుకున్నారు. ఏయే సమయాల్లో ఎంతెంత సేపు నిద్రపోతారు, దైనందిన అలవాట్లు వంటి పలు అంశాలపై ఓ ప్రశ్నపత్రాన్ని తల్లిదండ్రులకు అందించారు. అంతేకాదు, ఆ పిల్లలకు పదాలను వల్లించడంలో పరీక్షను నిర్వహించి వాటి నుంచి పరిశీలించిన అంశాలను కూడా అందులో పొందుపరచమని చెప్పారు. ఆ ప్రశ్నపత్రాలను అధ్యయనం చేసి తేల్చిందేమిటంటే... కొందరు పిల్లలు శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతూ.. రాత్రి మంచి నిద్రకు దూరమవుతున్నారు. అటాంటి వారు పగలు నిద్రమత్తు, అలసటతో ఉంటున్నారు. వీరు పఠన సామర్థ్య పరీక్షలో వెనుకబడ్డారు. నిర్ణీత సమయాల్ని పాటిస్తూ రోజూ ఏడెనిమిది గంటలు నిద్రపోయే పిల్లలు మెరుగైన సామర్థ్యాల్ని ప్రదర్శించారు. ఈ పిల్లలు పదాలను వల్లించడం, వాటిని జ్ఞాపకం పెట్టుకోవడంలో పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించారు. చదువులోనూ  ముందంజలో ఉంటున్నారు.  కాబట్టి చిన్నారులకు నిద్రపోవడానికి నిర్ణీత సమయాన్ని తల్లిదండ్రులు అలవరచాలంటున్నారు. ఇలా చేస్తే.. రోజూ ఒకే సమయానికి నిద్రలేవడం అలవాటవుతుంది. చదువుతోపాటు క్రీడలు, పోషకాహారం, మంచి అలవాట్లు చిన్నారులను నిద్రలేమి నుంచి దూరం చేస్తాయని, ఇవన్నీ వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతాయని చెబుతున్నారు ఈ అధ్యయనాన్ని చేసిన లండన్‌ రెజెంట్స్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు.


Advertisement

మరిన్ని