మన ఆరోగ్యానికి... పరీక్ష!

ఇంట్లో అందరి మంచీచెడ్డా చూసే అమ్మ.. తన ఆరోగ్యం విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉంటుంది. కానీ కరోనా తర్వాత ఈ అశ్రద్ధ మరింత పెరిగింది.  కుటుంబానికి కేంద్రబిందువు లాంటి మహిళ ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉంటేనే కదా తక్కిన కుటుంబమూ సంతోషంగా ఉండగలిగేది. అందుకే కౌమారం నుంచి మొదలుపెట్టి తర్వాత వివిధ దశల్లో దృష్టి పెట్టాల్సిన ఆరోగ్య పరీక్షలు, పరిష్కారాల గురించి వివరిస్తునారు ప్రముఖ వైద్యులు శాంతకుమారి...

Updated : 18 Nov 2021 05:42 IST

ఇంట్లో అందరి మంచీచెడ్డా చూసే అమ్మ.. తన ఆరోగ్యం విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉంటుంది. కానీ కరోనా తర్వాత ఈ అశ్రద్ధ మరింత పెరిగింది.  కుటుంబానికి కేంద్రబిందువులాంటి మహిళ ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉంటేనే కదా తక్కిన కుటుంబమూ సంతోషంగా ఉండగలిగేది. అందుకే కౌమారం నుంచి మొదలుపెట్టి తర్వాత వివిధ దశల్లో దృష్టి పెట్టాల్సిన ఆరోగ్య పరీక్షలు, పరిష్కారాల గురించి వివరిస్తున్నారు ప్రముఖ వైద్యులు శాంతకుమారి...

12-13 ఏళ్ల వయసులో...

రక్తహీనత... స్త్రీలను ఎక్కువగా వేధించే సమస్య ఇది. అందుకే కౌమార దశ నుంచే దీనిపై అవగాహన అవసరం. 12- 13 ఏళ్లలో హిమోగ్లోబిన్‌ పరీక్ష చేయించుకోవాలి. రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం 12గ్రా/డీఎల్‌ ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే రక్తహీనత కింద లెక్క. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.  పరిష్కారంగా చిన్నప్పటి నుంచే పోషకాహారం అందించాలి. ఇనుము ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, డ్రైనట్స్‌, పప్పులు ఎక్కువగా తీసుకోవాలి. ఈ వయసులోనే  హ్యుమన్‌ పాపిలోమా వైరస్‌ బారిన పడకుండా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వేయించాలి.

20 ఏళ్ల వయసులో...

బరువు పెరగటం, జుట్టురాలిపోవటం, తీవ్రమైన అలసట.. ఈ లక్షణాలు కనిపిస్తే థైరాయిడ్‌ పరీక్ష అవసరం. ఈ సమస్య మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లలో మూడురెట్లు ఎక్కవని అధ్యయనాలు చెబుతున్నాయి. సంవత్సరానికి ఒకసారి థైరాయిడ్‌ పరీక్ష చేయించుకోవాలి. 35 సంవత్సరాల వయస్సు తర్వాత హైపోథైరాయిడిజం రెట్టింపు అవుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి.

21 ఏళ్లు దాటాక...

పాప్‌స్మియర్‌ పరీక్ష చేయించుకోవాలి. ఏటా ఒకసారి చేయించుకోవడం వల్ల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లని (సర్విక్స్‌) ముందుగానే గుర్తించి  అప్రమత్తం కావొచ్చు.

వివాహానికి ముందు: ప్రతి స్త్రీ లేదా పురుషుడికి హెచ్‌ఐవీ, హైపటైటిస్‌ బి, సి పరీక్షలు తప్పనిసరి. ముందు జాగ్రత్తగా ఇవి ఉపయోగపడతాయి.

పెళ్లి తర్వాత: సంతానం గురించి ముందే ప్రణాళిక వేసుకోవాలి. గర్భం వచ్చాక ఏవైనా అవాంతరాలు వచ్చి అబార్షన్ల వరకు వెళ్లడం కన్నా ముందే వైరస్‌ ప్రొఫైల్‌ టెస్టులు చేసుకోవడం ద్వారా పుట్టే పిల్లలకు అవి సోకకుండా జాగ్రత్త పడొచ్చు.

35 తర్వాత... 

మనదేశంలో ఏటా 10 లక్షల రొమ్ము క్యాన్సర్‌ కేసులు నమోదవుతున్నాయి. అందులో 70-80 శాతం మంది మూడో దశ దాటిన తర్వాతే వ్యాధిని గుర్తించగలుగుతున్నారు. అందుకే ప్రతి మహిళకు 40 ఏళ్ల తర్వాత మామోగ్రఫీ పరీక్ష అవసరం. ఏటా ఈ పరీక్ష చేయించుకోవాలి. కుటుంబంలో రొమ్ము క్యాన్సర్‌ బాధితులుంటే అప్రమత్తం కావాలి. రొమ్ముల్లో నొప్పి లేని గడ్డలు తగిలినా, వాటి నుంచి స్రావాలు కారినా, లోపలకు నొక్కుకుపోయినట్లు ఉన్నా జాగ్రత్త పడాలి. ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన రొమ్ము క్యాన్సర్‌ ఉన్నట్లేనని చెప్పలేం. పరీక్షలు చేయించుకొని నిర్థరణ చేసుకోవడం ముఖ్యం. అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ వల్ల అండాశయ, గర్భాశయ క్యాన్సర్లను కూడా ముందే గుర్తించవచ్చు.

35-45 మధ్యలో...

ఈ వయసులో చక్కెర వ్యాధి బారిన పడే మహిళలు ఎక్కువ అవుతున్నారు. ఎలాంటి లక్షణాలూ కనిపించకుండా చాపకింద నీరులా పెరుగుతూ వచ్చే డయాబెటిస్‌ నుంచి నుంచి రక్షణ పొందడానికి రక్తంలో చక్కెర శాతాన్ని పరీక్ష చేయించుకోవాలి.

45-50 ఏళ్ల వయసులో...

ఈ వయస్సులో జీర్ణవ్యవస్థలో మార్పులు వస్తుంటాయి. మలబద్ధకం, మలంలో రక్తస్రావం, కడుపులో నొప్పి లాంటి లక్షణాలు వేధిస్తుంటే వెంటనే కొలనోస్కోపీ చేయించుకోవాలి. కొన్నిసార్లు ఈ లక్షణాలు పెద్దపేగు క్యాన్సర్‌కూ దారి తీస్తాయి. నడివయస్సులో ఎక్కువ మంది మహిళలకు గుండె సమస్యలు వస్తుంటాయి. 30 ఏళ్ల నుంచే అధిక రక్తపోటు, మధుమేహం లాంటి సమస్యలకు పరీక్షలు చేసుకోవాలి. ఒకవేళ బయటపడితే నియంత్రణలో పెట్టుకోవాలి. ఈ వయసులో అధిక బరువు ఉంటే ఆ ప్రభావం గుండె ఆరోగ్యంపై పడుతుంది.  అందుకే రోజూ ఒకగంట వ్యాయామం తప్పనిసరి.


ఇవీ అవసరమే...

లిపిడ్‌ ప్రొఫైల్‌: ఏడాదికోసారి చేయించుకోవాలి. ఈ రక్త పరీక్షలో కొలెస్టాల్ర్‌, ట్రైగ్లిజరాయిడ్స్‌, హెచ్‌డీఎల్‌, ఎల్‌డీఎల్‌ స్థాయిలను చూపుతుంది.

విటమిన్‌ పరీక్షలు: మగవాళ్లతో పోలిస్తే మహిళల్లో కీళ్లు, ఎముక సమస్యలు ఎక్కువ. రుతుక్రమం ఆగిపోయాక ఇవి ఎక్కువ అవుతాయి. విటమిన్‌ డి, క్యాల్షియం లోపం వల్ల ఎముక క్షీణత, బోలుగా మారడం వంటి సమస్యలూ తలెత్తుతాయి. అందుకే వైద్యుల సూచనల మేరకు విటమిన్‌ పరీక్షలు చేయించుకోవాలి. లోపం ఉంటే తగిన చికిత్స అందిస్తారు.

దంత ఆరోగ్యం: వయసు ఏదైనా దంత ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వద్దు. ఇది గుండె సమస్యలకు దారి తీస్తుంది. ఆరు నెలలకోసారి స్కేలింగ్‌ చేయించుకోవాలి. ఫలితంగా దంతాలకు గార పట్టినా... ఏవైనా లోపాలున్నా తెలుస్తుంది.
జుట్టు రాలుతుంటే: ఈ సమస్యకు ఒత్తిడి లేదా థైరాయిడ్‌ ప్రధాన కారణాలు. ప్రసవానంతరమూ ఇలా జరుగుతుంది. శరీరంలో పోషకాల లోపం ఉన్నా జుట్టు రాలుతుంది. విటమిన్‌ డి లోపం ఉన్నా... హార్మోన్ల అసమతుల్యత కూడా కారణాలే. వైద్యులను సంప్రదించి ఈ పరీక్షలు చేయించుకోవాలి.

-గొర్లె బాలకృష్ణ, హైదరాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్