బరువు తక్కువ ఉంటే...

రమ్య కొడుకు చిన్నప్పటి నుంచి సన్నగానే ఉంటాడు. ఆరోగ్యంగా ఉంటే చాలనుకునేదామె. అయితే తరచూ అనారోగ్యాలకు గురవుతున్నప్పుడే తెలిసింది...

Updated : 19 Nov 2021 05:34 IST

రమ్య కొడుకు చిన్నప్పటి నుంచి సన్నగానే ఉంటాడు. ఆరోగ్యంగా ఉంటే చాలనుకునేదామె. అయితే తరచూ అనారోగ్యాలకు గురవుతున్నప్పుడే తెలిసింది... వయసుకు తగ్గ బరువు లేక, బలహీనంగా ఉన్నాడని. ఇటువంటి చిన్నారుల ఆరోగ్యాన్ని పరిరక్షించి, సరైన బరువు పొందేలా చూడటానికి వైద్యులు ఏం సూచిస్తున్నారంటే...

చిన్నప్పటి నుంచి పిల్లలకు ప్రత్యేకంగా ఒక చార్ట్‌ను రూపొందించాలి. ఏ నెలకి ఎంత బరువు, ఎత్తు ఉన్నాడో అందులో పొందుపరుస్తూ ఉండాలి. ఎదిగే వయసులో సన్నగానే ఉంటారు అని భావించకుండా తగిన బరువు ఉన్నాడో లేదో గుర్తిస్తే మంచిది.

* కెలొరీలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని బరువు తక్కువగా ఉన్న పిల్లలకు అందించాలి. పాలను కలిపిన షేక్స్‌, స్మూథీలు, బంగాళాదుంపతో చేసిన వంటకాలు వారి ఆహారంలో ఉండేలా జాగ్రత్తపడాలి.

* కొవ్వు, పాల ఉత్పత్తులద్వారా వారికి కావాల్సిన పోషకాలను అందించొచ్చు. చీజ్‌, మిల్క్‌, గుడ్డు, చేప, గింజలు, విత్తనాలు వారి ప్లేటులో వీలైనన్ని ఉండాల్సిందే. కొంచెం పరిమాణమైనా చిన్నారులతో తినిపించాలి.

* రోజులో రెండు మూడుసార్లు కాకుండా అంతకన్నా ఎక్కువసార్లు తక్కువ తక్కువగా ఆహారాన్ని తీసుకునే అలవాటు చేయాలి. దీంతో ఎక్కువ రకాలను తినడానికి అవకాశం ఉంటుంది.

* ఆహారం తీసుకునే ముందు ద్రవపదార్థాలైన పండ్ల రసాలు, శీతల పానీయాలు, మంచి నీళ్లు అధికంగా ఇవ్వకూడదు. వీటితోనే పొట్ట నిండిపోయిన భావన కలిగి ఆహారం తీసుకోలేరు. వైద్యుల సలహా మేరకు మల్టీవిటమిన్లు, సప్లిమెంట్స్‌ అందించాలి.

* తినమని ఎక్కువ ఒత్తిడి చెయ్యకూడదు. ఇలా చేస్తే పూర్తిగా తినడం మానేస్తారు. కుటుంబంతో కలిసి కూర్చోబెట్టి ఆహారం
తీసుకునే అలవాటు చేయాలి. సరదాగా మాట్లాడుకుంటూ తినే ఆహారం వారికి మరింత ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఫోన్లు, టీవీలను చూస్తూ తినడం అలవాటు కాకుండా జాగ్రత్తపడాలి.

* క్రీడల్లో ఆసక్తి పెరిగేలా ప్రోత్సహించాలి. దాని వల్ల వారి కండరాలు బలోపేతమవడమే కాకుండా, సమయానికి ఆకలి వేస్తుంది. కడుపు నిండా తింటారు. అలాగే ఎక్కువ గంటలు నిద్ర పోవడంతో ఆరోగ్యంగా ఉంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్