Published : 20/11/2021 00:22 IST

ఈ కాలంలో హాయిగా..

బయట మంచు కురుస్తూ చల్లటి గాలులు వీస్తోంటే ఇల్లాలికి పొద్దున్నే పక్క దిగాలనిపించదు, ఇంకాసేపు పడుకుంటే బాగుండనిపిస్తుంది. కానీ చేయాల్సిన పనులు గుర్తొచ్చి ఉసూరుమంటూ లేవాల్సిందే! చలికాలం ఒక్క బద్ధకమే కాదు కొన్ని ఆరోగ్యసమస్యల్నీ తెచ్చిపెడుతుంది. వాటిని దూరంపెట్టి హుషారుగా ఉండేందుకు ఈ సూత్రాలు పాటించేయండి...

ఎక్కువసేపు ఇంట్లోనే గడపకుండా కొంతసేపు తప్పక బయట తిరగాలి. అప్పుడే శరీరానికి అవసరమైన డి-విటమిన్‌ అందుతుంది.

చల్లదనానికి వైరల్‌ ఫీవర్లు వచ్చేస్తాయి. వాటిని తరిమికొట్టాలంటే పరిశుభ్రత విషయంలో మరింత జాగ్రత్త వహిస్తూ క్రమం తప్పకుండా ఇల్లు తుడవాలి.

ఈ వాతావరణంలో దాహం వేయదు. అలాగని నీళ్లు తాగకుంటే కష్టం. కనుక గోరువెచ్చటి నీళ్లు తాగితే సరి.

చలిలో ఏం వెళ్తాములెమ్మని వాకింగు, వ్యాయామాలకు ఎగనామం పెట్టకండి. మొదలుపెట్టే దాకానే బద్ధకం. తర్వాత ఉత్సాహంగానే ఉంటుంది.

జ్వరంగా ఉంటే సొంత వైద్యం చేసుకోవద్దు, వైద్యుని సంప్రదించి ఏ జ్వరమో నిర్ధారించుకోండి. ఉదయాన్నే  కాఫీ, టీలకు బదులు శొంఠి కషాయం తాగడం ద్వారా ఫ్లూ జ్వరాలకు చెక్‌ పెట్టొచ్చు.

ఈ కాలంలో ఉప్పు అధికంగా ఉన్న చిప్స్‌ లాంటి తినుబండారాలూ స్వీట్లూ తగ్గించి తాజా కూరగాయలూ పండ్లూ తీసుకోవాలి. రోజూ ఉదయం మొలకెత్తిన గింజలు లేదా అరకప్పు క్యారెట్‌ తురుము తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సాయంత్రం ఒక కమలాపండు తినడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.

రాత్రి తినగానే పడుకోకూడదు. కొంతసేపు వ్యాయామం చేస్తే జీర్ణవ్యవస్థ బాగుంటుంది, చక్కగా నిద్ర పడుతుంది కూడా. ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే చలికాలం ఏ ఇబ్బందీ లేకుండా హాయిహాయిగా గడిచిపోతుంది.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని