అనుష్క జార్‌ బ్రేక్‌ఫాస్ట్‌
close
Updated : 03/12/2021 06:07 IST

అనుష్క జార్‌ బ్రేక్‌ఫాస్ట్‌!

మోడల్‌గా కెరియర్‌ ప్రారంభించిన అనుష్కాశర్మ బాలీవుడ్‌లో అడుగుపెట్టి తన నటనతో అందరినీ ఫిదా చేసింది. ఓ బిడ్డకు తల్లి అయినా... ఈ 33 ఏళ్ల భామ ఇప్పటికీ ఫిట్‌నెస్‌కు కేరాఫ్‌గానే నిలుస్తోంది. తన అందం, ఆరోగ్య రహస్యాలను చెప్పుకొచ్చిందిలా... ‘ఇంటి భోజనానికే ప్రాధాన్యమిస్తా. ‘యూ ఆర్‌ వాట్‌ యూ ఈట్‌’ మంత్రాన్ని నమ్ముతా, ఆచరిస్తా. ఉదయం ‘బ్రేక్‌ఫాస్ట్‌ ఇన్‌ ఎ జార్‌’ తీసుకుంటా. అంటే.. ముప్పావు కప్పు ఓట్స్‌, రెండు చెంచాల సబ్జా గింజలు, గుప్పెడు నట్స్‌, సీడ్స్‌... వీటిని విడి విడిగా నానబెడతా. వీటన్నింటికీ కప్పు పాలు కలిపి ఫ్రిజ్‌లో రాత్రంతా ఉంచేస్తా. మరుసటి ఉదయం ఈ మిశ్రమానికి రెండు చెంచాల తేనె, తాజా పండ్ల ముక్కలు వేసి తీసుకుంటా. తేనెకు బదులుగా చెంచా వెనిల్లా క్రీం కూడా కలుపుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది పోషక విలువలతో పాటు శక్తినిచ్చే ఆహారం. ఓట్స్‌, గింజల్లోని పీచు కడుపు నిండిన భావన కలిగించి, ఎక్కువసేపు ఆకలి వేయదు. పాలల్లోని కాల్షియం, మెగ్నీషియం, బి12, సి, డి విటమిన్లు ఎముకలను ఆరోగ్యంగా, కండరాలను బలంగా ఉంచుతాయి. జీవక్రియలను సమన్వయం చేస్తాయి. పాలకు బదులుగా బాదం లేదా సోయా పాలనూ కలపవచ్చు. ముందు రోజే అన్నింటినీ నానబెట్టి ఫ్రిజ్‌లో ఉంచుతా కాబట్టి ఉదయం ఎంత బిజీగా ఉన్నా తక్కువ సమయంలో ఎక్కువ పోషకాల బ్రేక్‌ఫాస్ట్‌ రెడీగా ఉంటుంది’ అంటోంది. మీరూ ప్రయత్నిస్తారా?


Advertisement

మరిన్ని