చలికాలం చర్మం జాగ్రత్త
close
Published : 06/12/2021 01:24 IST

చలికాలం చర్మం జాగ్రత్త!

చలి వల్ల చర్మం త్వరగా పొడిబారుతుంది. దాంతో పదే పదే మాయిశ్చరైజర్‌, కోల్డ్‌ క్రీమ్‌లను అప్లై చేస్తాం. అయితే వీటిలోని రసాయనాలతో సున్నిత చర్మం వారికి సమస్యలు వస్తాయి. అందుకే ఇంట్లో దొరికే సహజ పదార్థాలనే ఎక్కువగా వాడండి. వీటివల్ల చర్మం తాజాగా ఉంటుంది. దుష్ప్రభావాలూ ఉండవు.

పాలు...  చక్కటి క్లెన్సర్‌లా పనిచేస్తాయి. నిర్జీవంగా ఉన్న చర్మాన్ని లోపలి నుంచి శుభ్రం చేయడమే కాకుండా అందంగా, మృదువుగా, యవ్వనంగా కనిపించేలా మారుస్తాయి. పాలను మాయిశ్చరైజర్‌లానూ వాడుకోవచ్చు. అర కప్పు పాలలో అయిదారు చుక్కల చొప్పున నువ్వుల నూనె, ఆలివ్‌ నూనె కలిపి సీసాలో పోసి ఫ్రిజ్‌లో భద్రపరుచుకోవాలి. అవసరమైనప్పుడల్లా దూది ఉండ ముంచి రాసుకుంటే సరి. ఇలా చేయడం వల్ల చర్మం చాలాసేపు తాజాగా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని నాలుగైదు రోజుల వరకూ వాడుకోవచ్చు.

కొబ్బరినూనె.. ఇది దురద, కాలిన గాయాలు, ఎరుపుదనం, దద్దుర్లు... లాంటి వాటిని తగ్గించడంలో ముందుంటుంది. చర్మానికి కావాల్సిన తేమనూ అందిస్తుంది. కొన్ని చుక్కల కొబ్బరి నూనెను దూది ఉండ లేదా చేతివేళ్లతో ముఖానికి రాసుకోండి. ఆ తర్వాత మర్దనా చేయాలి. ఇలా చేస్తే మోము మృదువుగా మారుతుంది.

గ్లిజరిన్‌/ గులాబీ నీళ్లు... గ్లిజరిన్‌ చర్మంలోని పొడిదనంతోపాటు మచ్చలు, మొటిమలనూ తగ్గిస్తుంది. 100 ఎం.ఎల్‌. గులాబీ నీటిలో చెంచా గ్లిజరిన్‌ కలపాలి. ఈ ద్రవాన్ని సీసాలో పోసి మూతపెట్టి ఫ్రిజ్‌లో భద్రపరచాలి. అవసరమైనప్పుడల్లా కాటన్‌ సాయంతో అప్లై చేసుకుంటే సరి.


Advertisement

మరిన్ని