నెలసరి సమస్యలపై నిర్లక్ష్యం వద్దు...

శారీరకంగా కలిగే పలు రకాల అనారోగ్యాలపై శ్రద్ధ పెట్టినట్లే, నెలసరిలో ఎదురయ్యే సమస్యలకూ కారణాలను గుర్తించి చికిత్సను పొందాలంటున్నారు వైద్య నిపుణులు. లేదంటే దానికి భవిష్యత్తులో మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Published : 07 Dec 2021 00:50 IST

శారీరకంగా కలిగే పలు రకాల అనారోగ్యాలపై శ్రద్ధ పెట్టినట్లే, నెలసరిలో ఎదురయ్యే సమస్యలకూ కారణాలను గుర్తించి చికిత్సను పొందాలంటున్నారు వైద్య నిపుణులు. లేదంటే దానికి భవిష్యత్తులో మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

సాధారణంగా పీసీఓడీ, అధిక రక్తస్రావం వంటివి నెలసరిలో సమస్యలకు కారణం. ఆ సమయంలో సామాజిక, సంప్రదాయ పరంగా దూరంగా ఉండటం, శుభ్రమైన పద్ధతులను పాటించక పోవడం వంటివీ సమస్యలే. ఈ రోజుల్లో ప్రతి ఆరు లేదా ఎనిమిది గంటలకు శానిటరీ ప్యాడ్లు మార్చాలి.

* పరిశుభ్రత.. పరిశుభ్రమైన వస్త్రాన్ని వినియోగించకపోవడం, సమయంలోపు వాటిని మార్చకపోవడం వంటివి జననేంద్రియ మార్గంలోని నాళాలు, మూత్రాశయ నాళాల్లో ఇన్ఫెక్షన్స్‌కు దారి తీసే ప్రమాదం ఉంది. రక్తస్రావం ఎక్కువైతే రక్తహీనతకూ దారి తీయొచ్చు. కాబట్టి అవసరమైతే ఎక్కువ సార్లు ప్యాడ్‌ను మార్చుకోవడం, అలాగే పరిశుభ్రమైన, మృదువైన వస్త్రాన్ని ఎంపిక చేసుకోవడంతోపాటు జననేంద్రియాల్ని తరచూ నీటితో శుభ్రం చేసుకోవడం చేయాలి.

* మందులు.. నెలసరిలో సాధారణంగా మొదటి రెండురోజులు అధిక రక్తస్రావం ఉంటుంది. అలా కాకుండా అయిదు నుంచి ఏడు రోజులపాటు కొనసాగితే హిమోగ్లోబిన్‌ తగ్గడంతోపాటు రక్తహీనత ప్రమాదం ఉంది. కాబట్టి వైద్యులను సంప్రదించి, వారి సలహా మేరకు ఐరన్‌ సప్లిమెంట్స్‌ తీసుకోవాలి. అలాగే వయసు పెరిగి నెలసరి ఆగిపోతున్నప్పుడూ హార్మోన్ల ప్రభావంతో రక్తస్రావంలో మార్పులు కనిపిస్తాయి. నెలసరి తేదీలు మారతాయి. ఈ సమయంలోనూ వైద్యులను సంప్రదించాలి.

* మెనోపాజ్‌.. ఈ దశలోకి అడుగు పెడుతున్నప్పుడు అధిక చెమట, ఒంటి నుంచి వేడి ఆవిర్లు, ఒత్తిడి, చిరాకు, కీళ్లు, కండరాల్లో నొప్పి, అధిక బరువు, దాంపత్య జీవితంపై అనాసక్తి ఎక్కువగా కనిపిస్తాయి. ఈస్ట్రోజన్‌ తగ్గిపోవడమే కారణం. వైద్యనిపుణులను సంప్రదించి చికిత్సను పొందితే సంతోషంగా, ఆరోగ్యంగా ఉండొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్