పండంటి ఆరోగ్యానికి

పండ్లను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలంటారు పోషకాహార నిపుణులు. వీటిని తినడం వల్ల కలిగే లాభాలు బోలెడు. దేనికదే ప్రత్యేకమైన రంగు, రుచితో వైవిధ్యాన్ని కలిగి, భిన్న పోషకాలతో నిండి ఉంటాయి. అవేంటో, వాటివల్ల మనకు కలిగే లాభాలేంటో చూద్దామా..గుండె ఆరోగ్యానికి... అన్ని కాలాల్లో అందుబాటులో ఉండే పండ్లలో పుచ్చకాయ ఒకటి. ఇది శరీరానికి కావాల్సిన తేమను అందించడంతోపాటు పోషకాలనూ ఇస్తుంది. బరువును అదుపులో ఉంచుతుంది. గుండె...

Published : 17 Jan 2022 00:15 IST

పండ్లను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలంటారు పోషకాహార నిపుణులు. వీటిని తినడం వల్ల కలిగే లాభాలు బోలెడు. దేనికదే ప్రత్యేకమైన రంగు, రుచితో వైవిధ్యాన్ని కలిగి, భిన్న పోషకాలతో నిండి ఉంటాయి. అవేంటో, వాటివల్ల మనకు కలిగే లాభాలేంటో చూద్దామా..

గుండె ఆరోగ్యానికి... అన్ని కాలాల్లో అందుబాటులో ఉండే పండ్లలో పుచ్చకాయ ఒకటి. ఇది శరీరానికి కావాల్సిన తేమను అందించడంతోపాటు పోషకాలనూ ఇస్తుంది. బరువును అదుపులో ఉంచుతుంది. గుండె వేగాన్ని నియంత్రిస్తుంది. బ్లూబెర్రీస్‌ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆకుపచ్చ, నల్లద్రాక్ష రెండూ రుచితోపాటు రక్తనాళికలకు సాంత్వనను కలిగిస్తాయి. నాడులకు విశ్రాంతి కల్పించాలంటే చెర్రీస్‌ తినాల్సిందే.

నిరోధకశక్తి కావాలా... నారింజ పండులోని విటమిన్‌-సి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది రోగనిరోధకతను పెంచడమే కాకుండా చర్మానికి నిగారింపునూ ఇస్తుంది. కంటి ఆరోగ్యాన్నీ కాపాడుతుంది. పీచ్‌లలో పొటాషియం, ఫ్లోరైడ్‌, ఇనుము లాంటి ఖనిజాలు దండిగా ఉంటాయి. యాపిల్‌లోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధకతను అందించి ఇన్‌ఫెక్షన్లతో పోరాడే శక్తిని అందిస్తాయి. జామ ఇమ్యూనిటీ, మేను మెరుపు... రెండింటినీ పెంచుతుంది.

క్యాన్సర్లతో పోరాడతాయివి... ప్రకాశవంతమైన రంగులో ఉండే స్ట్రాబెర్రీస్‌ని కాస్త తక్కువగా తీసుకుంటాం. అయితే వీటిలోని యాంటీఆక్సిడెంట్లు.. క్యాన్సర్‌ కారకాలతో పోరాడతాయట. అలాగే వృద్ధాప్య ఛాయలనూ త్వరగా దరి చేరకుండా అడ్డుకుంటాయి. మరింకేం ఈ పండ్లను తిందామా మరి. అలాగే మామిడి పండు గురించి మనం ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఇది తియ్యదనంతోపాటు రకరకాల క్యాన్సర్‌లు రాకుండా అడ్డుకుంటుంది.

ఎముకలు బలంగా... అరటిపండులో బోలెడు ఖనిజాలుంటాయి. ముఖ్యంగా క్రీడాకారులకు, వ్యాయామం చేసేవారికి చక్కటి ఎంపిక. ఇది తక్షణ శక్తిని ఇస్తుంది.  పైనాపిల్‌, దానిమ్మ కీళ్లనొప్పులను అడ్డుకుంటాయి. కివి పండ్లు ఎముక మజ్జను పెంచడంలో తోడ్పడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని