పూలతో ఉత్తేజం

ఒక్కోసారి మనసు దేని మీదా లగ్నం కాదు. ఏకాగ్రత కుదరదు. రకరకాల ఆలోచనలు... ఏవీ స్థిరంగా సాగవు. అప్పుడు చికాకొస్తుంది. కానీ చేయాల్సిన పని ఎదురుగా తరుముతూ ఉంటుంది. అప్పుడు ఇలా చేయండి. పసుపు, నారింజ వంటి రంగుల్ని కాసేపు చూడండి. లేదా ఏ బంతో, చామంతి పూలనో చూడండి. చాలా త్వరగా అంటే ఒకటి రెండు నిమిషాల్లోనే ఏకాగ్రత కుదురుతుందట. ఈ రంగులు మెదడును కమ్ముకున్న పొగమంచులాంటి ఆలోచనలను తొలగించి ఏకాగ్రతను ఇస్తాయట.

Published : 20 Jan 2022 00:49 IST

ఒక్కోసారి మనసు దేని మీదా లగ్నం కాదు. ఏకాగ్రత కుదరదు. రకరకాల ఆలోచనలు... ఏవీ స్థిరంగా సాగవు. అప్పుడు చికాకొస్తుంది. కానీ చేయాల్సిన పని ఎదురుగా తరుముతూ ఉంటుంది. అప్పుడు ఇలా చేయండి. పసుపు, నారింజ వంటి రంగుల్ని కాసేపు చూడండి. లేదా ఏ బంతో, చామంతి పూలనో చూడండి. చాలా త్వరగా అంటే ఒకటి రెండు నిమిషాల్లోనే ఏకాగ్రత కుదురుతుందట. ఈ రంగులు మెదడును కమ్ముకున్న పొగమంచులాంటి ఆలోచనలను తొలగించి ఏకాగ్రతను ఇస్తాయట.

నిస్సత్తువా... మీకెప్పుడైనా నిస్సత్తువగా అనిపిస్తోంటే... ముదురు వర్ణాల్లో ఉండే పూలను రెండు నిమిషాలు తదేకంగా చూడండి. రోజూ రెండు సార్లు ఇలా చేస్తూ ఉంటే వెంటనే మీ శక్తి స్థాయిలు 35 శాతం పెరుగుతాయని యూనివర్సిటీ ఆఫ్‌ ఎస్సెక్స్‌ పరిశోధకులు తేల్చారు. ముదురు రంగులు మెదడులో బీటా తరంగాలను పెంచుతాయి.. సెరిబ్రల్‌ కోర్టెక్స్‌  భాగాన్ని ఉత్తేజితం చేస్తాయి. ఇది మనల్ని ఉత్సాహంగా, చురుగ్గా ఉంచేలా చేస్తుంది.

బోలెడు పనులా... పనుల జాబితా బెంబేలెత్తేలా ఉంటే... గులాబీల వాసన చూడండి. లేదా రోజ్‌ ఎస్సెన్షియల్‌ ఆయిల్‌ అయినా ఫర్వాలేదు. ఈ వాసన కేంద్ర నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసి అయిదే నిమిషాల్లో ఉత్సాహాన్ని నింపుతుందని  షికాగోలోని స్మెల్‌ అండ్‌ టేస్ట్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌ పరిశోధకులు చెబుతున్నారు.

బరువుకు ఆకుపచ్చ... ఆకుపచ్చరంగు పూలు లేదా నవనవలాడే ఆకుకూరలు వంటివి కాసేపు చూస్తే ఆకలి తగ్గి బరువు నియంత్రణలో ఉపయోగపడుతుందట! ఇదేం చిత్రం అంటారా...  ఆకు పచ్చ రంగులు మెదడులో ఆకలి సంకేతాలను తగ్గిస్తాయట. అప్పుడు తిండి తగ్గిస్తాం కదా!

చింతకు దూరం.. మనం చేతులు కడుక్కునే లావెండర్‌ సబ్బు మీ చింతలను కూడా దూరం చేస్తుందట. లావెండర్‌లో సువాసన నిచ్చే ‘లినాలూల్‌’ అనే పదార్థం మన ముక్కులోని నాడుల్ని ప్రేరేపించి మెదడుకు ప్రశాంతంగా ఉండమని సంకేతాలను పంపేలా చేస్తుందట. మరో విషయం తెలుసా... ఆందోళనను తగ్గించడానికి ఇచ్చే మందులంత ప్రభావవంతంగా ఈ వాసన పని చేస్తుందట. అందువల్ల బాగా ఒత్తిడిగా అనిపించినప్పుడు లావెండర్‌ వాసన చూడమని పరిశోధకులు చెబుతున్నారు. కుంకుమపువ్వులో ఉండే సాఫ్రనాల్‌ అనే పదార్థం మనలో హ్యాపీ హార్మోన్స్‌ స్థాయుల్ని పెంచుతుందని ఆస్ట్రేలియన్‌ పరిశోధకులు చెబుతున్నారు.

కీళ్ల నొప్పులా... పొద్దుతిరుగుడు గింజల్ని తింటున్నారా? దానికీ దీనికీ ఏంటి సంబంధం అంటారా? ఉందండీ. ఈ గింజల్లో ఉండే సెలీనియం చాలా మంచిదట. ఇది కీళ్లనొప్పులు కలిగించే ఫ్రీరాడికల్స్‌ని తొలగించడంలో బాగా పని చేస్తుందట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని