Updated : 08/02/2022 05:14 IST

అప్పుడు.. 60 ల్లోనూ ఆనందమే!

సుజాతకు 30 ఏళ్లు నిండాయంతే. అప్పుడే ఎక్కువదూరం నడిచినా, నాలుగు మెట్లు ఎక్కినా మోకాళ్ల నొప్పులతో బాధపడుతోంది. తన శరీరం తనకే బరువుగా అనిపించడం ఆమెను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వయసులో ఆరోగ్యకరమైన జీవనశైలితోపాటు పాటించే కొన్ని నియమాలు... 60లోనూ ఆనందంగా గడిపేలా చేస్తాయంటున్నారు వైద్యనిపుణులు. అవేంటంటే..

ఆందోళన, అనవసరపు ఆలోచనలకు దూరంగా ఉండాలి. లేదంటే రక్తపోటు, మధుమేహం, హృద్రోగాలు త్వరగా దరిచేరే ప్రమాదముంది. ఇంటిల్లపాదినీ ఒక తాటిపై నడిపించడానికి అవసరమైన మానసిక శక్తిని పొందాలంటే నిత్యం వ్యాయామం, యోగా వంటివి తప్పనిసరి. అభిరుచులకూ కొంత సమయాన్ని కేటాయించుకోవాలి.

పోషకాలు.. నిత్య ఆహారంలో ప్రొటీన్లు, ఖనిజ లవణాలున్న వాటిని చేర్చుకోవాలి. ముఖ్యంగా క్యాల్షియం పుష్కలంగా ఉండే కాయగూరలు, పాలు, చేపలు, బాదం వంటివి తీసుకుంటే శారీరక సామర్థ్యం తగ్గకుండా ఉంటుంది. ఎముకలు, కండరాలు బలోపేతమవుతాయి. నాలుగు నుంచి అయిదు లీటర్ల నీటిని తాగితే డీహైడ్రేషన్‌ అవ్వకుండా ఉంటుంది.

ఏటా.. 30వ పడిలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఏటా పాప్‌స్మియర్‌ సహా రొమ్ము క్యాన్సర్‌ సంబంధిత వైద్యపరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. ఎముకల బలహీనత, రక్తహీనత, రక్తపోటు, మధుమేహం వంటి పలు అనారోగ్యాలు దరిచేరకుండా వైద్యుల సలహాలను పాటించాలి. 30-65 మధ్యలో ఉన్నప్పుడు ప్రతి అయిదేళ్లకు హెచ్‌పీవీ పరీక్షనూ చేయించుకోవాలి.

కుటుంబంతో.. ఇంటి సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడపండి. భర్త, పిల్లలతో గడిపే సమయం ఉల్లాసాన్ని కలిగిస్తుంది. పని మధ్యలో తీసుకునే చిన్నచిన్న విరామాలు శరీరానికి మరింత శక్తి సమకూరేలా చేస్తాయి. నిద్రలేమి సమస్యకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తే చాలు. శారీరక, మానసికారోగ్యం మీ సొంతమవుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని