Published : 17/02/2022 00:22 IST

మయూరాసనంతో మేలెంతో!

ఇంటా బయటా ఊపిరాడని పనులతో వ్యాయామం చేయలేకపోతున్నామని, వాకింగుకు వెళ్లలేకపోతున్నామని బాధపడుతున్నారా? అయితే ఉదయానే ఒక్క పావుగంట యోగా కోసం కేటాయించండి. వజ్రాసనం, శవాసనం లాంటి సులువైన ఆసనాలతో మొదలు పెట్టండి. క్రమంగా కాస్త కాస్త చొప్పున సమయాన్ని పెంచండి. శరీరం ఫ్లెక్సిబుల్‌గా తయారయ్యాక మయూరాసనం వేశారంటే.. సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుంది. ఇందులో పద్మ మయూరాసనం, పింఛ మయూరాసనం.. అంటూ రకాలున్నాయి.

ఎలా చేయాలంటే...

మోకాళ్ల మీద కూర్చుని ముందుకు వంగి చేతులను కింద ఆనించాలి. చేతుల మీద బరువంతా మోపుతూ మెల్లమెల్లగా శరీరాన్ని పైకి లేపాలి. శ్వాస తీసుకుంటూ వదులుతూ 10 నుంచి 30 క్షణాలు పాటు ఈ భంగిమలో ఉండి, నెమ్మదిగా యథాస్థితికి రావాలి. తేలిగ్గానే అనిపించినప్పటికీ.. యోగా గురువు దగ్గర సాధన చేసిన తర్వాతే ఇంట్లో చేయడం మంచిది. లేదంటే ఒళ్లు పట్టేయడం, నరాలు చెదరడం లాంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముంది.

ఎన్ని ప్రయోజనాలో...

ఈ ఆసనంతో మొత్తం శరీరమంతా దృఢంగా తయారవుతుంది. కండరాలు గట్టిపడతాయి. రక్తప్రసరణ బాగుంటుంది. చేతులు బలంగా మారతాయి. దేన్నయినా తట్టుకు నేర్పు, సహనం అలవడతాయి. ఆత్మవిశ్వాసం చేకూరుతుంది. పొట్ట, కాలేయం, పేగులు, మూత్రపిండాలు, క్లోమగ్రంథి, పొత్తికడుపు, ఊపిరితిత్తులు.. ఇలా ప్రతి అవయవం శక్తిని పుంజుకుంటుంది. సంతానోత్పత్తి సమస్యలను అధిగమించడంలో తోడ్పడుతుంది. మధుమేహంతో బాధపడే వారికి దీని వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది.

ఎవరెవరు చేయకూడదంటే...

శస్త్ర చికిత్సలు చేయించుకున్నవారు, మణికట్టు, మోచేతులు, భుజాలు, వీపు కింది భాగం, మెడ, పక్కటెముకలు పొత్తికడుపు హెర్నియా, పెప్టిక్‌ అల్సర్‌ లేదా ఉదర భాగాలకు సంబంధించిన సమస్యలు, అధిక రక్తపోటు, గుండె జబ్బులున్న వాళ్లు, నడుంనొప్పి, కీళ్లనొప్పులతో బాధపడే వృద్ధులు ఈ ఆసనం చేయకూడదు. అలాగే గర్భిణులు, నెలసరిలో ఇబ్బంది ఉన్న స్త్రీలు కూడా ఇది చేయకూడదు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని