Updated : 12/03/2022 05:51 IST

ఆరోగ్యాన్ని శాసించేది ఆహారమే...

మాలతి, ఇందుమతి ప్రాణ స్నేహితులే అయినా... శారీరక సామర్థ్యంలో ఇద్దరికీ పోలికే ఉండదు. మాలతి ఆరోగ్యంగా, చురుకుగా కనిపిస్తే, ఇందు నిత్యం అనారోగ్యంగా, నీరసంగా ఉంటుంది. దీనికి కారణం తీసుకునే ఆహారంలో మార్పులే అంటున్నారు నిపుణులు. వంటింటి అలమరలో రుచితోపాటు పోషకవిలువలున్న వాటికీ చోటిస్తే ఇంటిల్లపాదీ ఆరోగ్యంగా ఉండొచ్చంటున్నారు. అవేంటంటే...

రాగులు... ప్రొటీన్లుతోపాటు సి, బి, ఈ విటమిన్లు, ఐరన్‌, కాల్షియం వంటి ఖనిజలవణాలు పుష్కలంగా ఉండే రాగుల వినియోగం వంటలో తప్పనిసరి. ఇవి చర్మం, జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఉదయపు అల్పాహారంగా రాగి రోటీ, అట్లు వంటివి తీసుకుంటే నరాల వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. కండరాలు బలోపేతమవుతాయి. నూతన శక్తి వస్తుంది.
బెల్లం.. చక్కెరకు ప్రత్యామ్నాయంగా బెల్లం వినియోగాన్ని పెంచుకోవాలి. పోషక విలువలు, యాంటీ ఆక్సిడెంట్స్‌, ఖనిజలవణాలు ఉన్న బెల్లాన్ని వంటల్లో వేయాల్సిన అవసరం కూడా లేకుండా అలాగే తీసుకోవచ్చు. మహిళలకు ఇది మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పెరుగన్నంలో కలిపి తింటే రుచి పెరుగుతుంది. రక్తాన్ని, కాలేయాన్ని శుద్ధి చేసే గుణాలు ఇందులో మెండు. వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.
ఖర్జూరం.. మధుమేహం ఉన్నవారికి కూడా ఈ పండు పోషకాహారంగా ఉపయోగపడుతుంది. పొటాషియంతోపాటు ఫ్లెవనాయిడ్స్‌, కెరోటినాయిడ్స్‌, ఫెనాలిక్‌ యాసిడ్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్స్‌ ఖర్జూరంలో పుష్కలం. పీచు ఎక్కువగా ఉండి జీర్ణశక్తికి సంబంధించిన సమస్యలను దూరంగా ఉంచుతుంది. మెదడు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచి వయసుపైబడిన వారిలో వచ్చే అల్జీమర్‌ వ్యాధిని దరి చేరనివ్వదు. స్వీట్లు చేసినప్పుడు చక్కెరకు బదులుగా బెల్లం, ఖర్జూరాన్ని వినియోగిస్తే రుచితోపాటు ఇంటిల్లపాదికి ఆరోగ్యం.
కొబ్బరి.. మాంగనీస్‌, మెగ్నీషియం, కాపర్‌, పొటాషియం వంటి ఖనిజ లవణాలుండే కొబ్బరిని రోజూ తీసుకుంటే మంచిది. శరీరం శక్తివంతంగా ఉంటుంది. ఇంట్లో స్వీట్లు, ప్రత్యేక వంటకాలు చేసేటప్పుడు బాదం, వేరుశనగ, జీడిపప్పు వంటి వాటిని వేస్తే శారీరకంగానే కాదు, మానసికారోగ్యాన్నీ పెంపొందించుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని