నిర్లక్ష్యం చేయొద్దు..

వయసురీత్యా లేదా భవిష్యత్తు అనారోగ్యాలకు ముందుగానే కొన్ని సంకేతాలు ఎదురవుతాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందంటున్నారు వైద్యులు. అవేంటంటే...

Updated : 22 Mar 2022 04:32 IST

వయసురీత్యా లేదా భవిష్యత్తు అనారోగ్యాలకు ముందుగానే కొన్ని సంకేతాలు ఎదురవుతాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందంటున్నారు వైద్యులు. అవేంటంటే...

డిశ్చార్జ్‌... కొందరిలో నెలసరికి ముందు, ఆ తర్వాత లేదా పలు సందర్భాల్లో వైట్‌ డిశ్చార్జ్‌ అవుతుంటుంది. కొందరిలో ఇది అధికంగా కావడం, పసుపు వర్ణంలో దుర్వాసనతో కూడి ఉంటుంది. సాధారణంగాకన్నా భిన్నంగా కనిపిస్తే మాత్రం భవిష్యత్తులో రాబోయే పెనుసమస్యను ఇది సూచిస్తోందని గుర్తించాలి. యోని వద్ద దురద లేదా మంట ఉంటే  వైద్యులను సంప్రదించాలి. ఇన్‌ఫెక్షన్‌ లేదా వేరే ఏదైనా కారణం కావొచ్చు.

యూటీఐ.. మహిళల్లో ఎక్కువగా యూరినరీ ట్రాక్ట్‌ ఇన్‌ఫెక్షన్స్‌(యూటీఐ)కలుగుతుంటాయి. తేలికగా వైరస్‌ లేదా బ్యాక్టీరియాలు మూత్రాశయానికి చేరుకోవడమే దీనికి కారణం. యోని వద్ద ఇన్‌ఫెక్షన్‌ యూటీఐకీ దారితీస్తుంది.

పొడారితే.. మెనోపాజ్‌ సమయంలో యోని వద్ద పొడారడం సహజమైన మార్పు. హార్మోన్ల స్థాయులు తగ్గినప్పుడు ఏర్పడే ఈ సమస్యతో తీవ్రమైన నొప్పి ఉంటుంది. దీంతో కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు వ్యాయామాలు చేసేటప్పుడు ఎంతో ఇబ్బంది అనిపిస్తుంది.

నెలసరిలో.. కొందరిలో నెలసరి క్రమం తప్పడం, తక్కువ లేదా అధిక రక్తస్రావం కనిపిస్తాయి. సాధారణంగా ప్రతి నెలసరికి ఏడు రోజుల్లోపు 80 ఎం.ఎల్‌ రక్తస్రావం అవుతుంది. దీనికి మించి అవుతోందంటే సమస్య ఉన్నట్లే.

పీసీఓ... హార్మోన్ల అసమతుల్యత కారణంగా పాలిసిస్టిక్‌ ఓవరీ సిండ్రోం (పీసీఓ) ఏర్పడుతుంది. ఇది నెలసరిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అధికబరువు, శిరోజాలు రాలిపోవడం, మెడ చుట్టూ చర్మం నల్లబడటం వంటివీ పీసీఓకు సంకేతాలు. వైద్యుని పర్యవేక్షణలో బరువు తగ్గడం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, ఆహారంలో మార్పులు, వ్యాయామం వంటివి చేస్తే ఫలితం ఉంటుంది.  

రొమ్ము క్యాన్సర్‌... ఎవరికి వారే రొమ్ము క్యాన్సర్‌ ఉందో లేదో గుర్తించొచ్చు. నిమిషం పాటు చేసే ఈ స్వీయ పరీక్షతో మున్ముందు వచ్చే సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. నెలసరి మొదలైన 3 నుంచి 5 రోజుల్లోపు ఈ పరీక్షకు అనువైన సమయం. అద్దం ఎదుట నిలబడి రొమ్ము చుట్టూ అరచేతితో మృదువుగా గుండ్రంగా రుద్దాలి. అక్కడి చర్మంలో మార్పు, చేతికి తగిలేలా చిన్న గడ్డ ఉన్నా గుర్తించాలి.

కుంగుబాటు.. హార్మోన్ల మార్పు కుంగుబాటుకు కారణమవుతుంది. గర్బధారణలో లేదా ప్రసవం అనంతరం, గర్భస్రావం జరిగినప్పుడు లేదా మెనోపాజ్‌ సమయంలో కుంగుబాటు, ఒత్తిడి, మూడ్‌ స్వింగ్స్‌ వస్తాయి.

సర్వైకల్‌ క్యాన్సర్‌... యోని వద్ద దురద, అధికస్రావం, తీవ్ర పొత్తికడుపునొప్పి వంటి పలు రకాల సమస్యలున్నప్పుడు సర్వైకల్‌ క్యాన్సర్‌కు దారి తీసే అవకాశం ఉండొచ్చు.
... ఇలాంటివి ఏమున్నా నిర్లక్ష్యం చేయద్దు. వెంటనే వైద్యులను సంప్రదించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్