తల్లి అవ్వాలంటే... బరువు కాదు ఆరోగ్యమే ముఖ్యం!

ఊబకాయుల్లో సంతానలేమికి వారి అధిక బరువు కూడా కారణం కావొచ్చని ఇన్నాళ్లూ భావించేవారు వైద్యులు. దీంతో తల్లి అవ్వాలనుకునే మహిళలు అధిక బరువుతో ఉంటే అదనపు బరువు తగ్గించుకోమని సలహా ఇస్తుంటారు వైద్యులు.

Published : 07 Apr 2022 01:20 IST

ఊబకాయుల్లో సంతానలేమికి వారి అధిక బరువు కూడా కారణం కావొచ్చని ఇన్నాళ్లూ భావించేవారు వైద్యులు. దీంతో తల్లి అవ్వాలనుకునే మహిళలు అధిక బరువుతో ఉంటే అదనపు బరువు తగ్గించుకోమని సలహా ఇస్తుంటారు వైద్యులు. ఓ తాజా అధ్యయనంలో మాత్రం దీనికి భిన్నమైన ఫలితం వచ్చింది.

మెరికాలోని ‘వర్జీనియా స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌- సెంటర్‌ ఫర్‌ రిసర్చ్‌ ఫర్‌ రిప్రొడక్షన్‌’ ఆధ్వర్యంలో ఊబకాయులైన మహిళల్లో సంతాన సాఫల్యతపైన ఓ అధ్యయనం చేపట్టారు. ఇప్పటివరకూ పెద్దగా దృష్టిపెట్టని ‘వ్యాయామాలు’- ‘వ్యాయామాలతోపాటు బరువు తగ్గడం’ ఈ రెండు అంశాల్నీ పోల్చుతూ ఈ అధ్యయనం చేశారు. ఇందుకోసం ఊబకాయులైన 379 మంది మహిళలను ఎంపిక చేసుకున్నారు. వీళ్లంతా సంతానలేమి సమస్యనీ ఎదుర్కొంటున్నవాళ్లే.  

ఈ మహిళలను రెండు వర్గాలుగా విభజించారు. ఒక వర్గాన్ని ఆహార నియమాలు పాటిస్తూ, మందులు వాడుతూ, వ్యాయామాలూ చేస్తూ బరువు తగ్గమని చెప్పారు. బరువు తగ్గడంపైన దృష్టి పెట్టకుండా వ్యాయామాలు చేస్తూ కేవలం శారీరక దృఢత్వాన్ని పెంచుకోమని రెండో వర్గానికి సూచించారు. 16 వారాల పాటు ఇలా చేయిస్తూనే వీరందరికీ సంతానం కలగడానికి తగిన చికిత్సనూ అందించారు. వ్యాయామాలూ, ఆహార నియమాలతో బరువు తగ్గేందుకు ప్రయత్నించిన మొదటి వర్గంలో 188 మందిలో 23 మంది గర్భం దాల్చారు. అదే సమయంలో రెండో వర్గంలోని 191 మందికిగానూ 29 మంది తల్లులయ్యారు. మొదటి వర్గంలో వ్యాయామాలతోపాటు మందులూ, ఆహార నియమాలవల్ల అధిక క్యాలరీలు తగ్గడంతో వారిలో మెటబాలిక్‌ సిండ్రోమ్‌ స్థాయులు పడిపోయినట్లుగా అధ్యయనంలో తేలింది. దీంతో హృద్రోగం, మధుమేహం వంటి ప్రమాదకర అనారోగ్యాలు దరిచేరే ముప్పూ కనిపించింది. అలాగే గర్భం దాల్చే అవకాశాలూ తక్కువగానే ఉన్నాయి. సాధారణ వ్యాయామాలతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ, శారీరకంగా దృఢంగా ఉండటానికి ప్రయత్నించినవారిలో గర్భందాల్చే శాతం పెరిగింది. బరువు నియంత్రణలో ఉండటం మంచిదే అయినా... సంతాన సాఫల్యత విషయంలో బరువు ప్రభావం తక్కువగా ఉన్నట్లు  అధ్యయనం తేల్చింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్