ఈ ఉపవాసం బరువు తగ్గిస్తుందా?

అధికరక్తపోటు, గుండెపోటు.. లాంటి వాటి నుంచి బయటపడాలంటే బరువు నియంత్రణ తప్పనిసరి. మీరు పాటించే పద్ధతులతో..

Updated : 14 Apr 2022 13:10 IST

మా ఇంట్లోవాళ్లకి గుండె సంబంధ సమస్యలున్నాయి. నేను వాటి నుంచి తప్పించుకోవడానికి బరువు 20 కిలోలు తగ్గి 60కి చేరుకున్నా. శాకాహారానికే ప్రాధాన్యం ఇచ్చా. అయినా మళ్లీ బరువు నిదానంగా పెరుగుతోంది. నియంత్రించుకునేదెలా? ఇంటర్‌మిటెన్ట్‌ ఫాస్టింగ్‌ చేయొచ్చా? - ఓ సోదరి, భువనగిరి

అధికరక్తపోటు, గుండెపోటు.. లాంటి వాటి నుంచి బయటపడాలంటే బరువు నియంత్రణ తప్పనిసరి. మీరు పాటించే పద్ధతులతో రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయులు నియంత్రణలోకి రావడమే కాక బరువూ తగ్గొచ్చు. పెరగకుండా చూసుకోవడం మరో సవాలు. ఇందుకు కొన్ని నియమాలు పాటించాలి. పరిమిత ఆహారంతోపాటు ఎక్కువ కెలొరీలు ఖర్చయ్యే వ్యాయామాలు చేయాలి. శరీరంలో కొవ్వు, కండ శాతాలు తెలిపే కొన్ని పరీక్షలూ చేయించుకోండి. వయసు పెరుగుతున్న కొద్దీ మనకు మెనోపాజ్, పెరి మెనోపాజ్, పోస్ట్‌ మెనోపాజ్‌ దశల్లో హార్మోన్లలో మార్పులొస్తాయి. ఈ సమయంలో ఎక్కువ కెలొరీల అవసరమూ ఉండదు. దీంతో బరువు నియంత్రణ ఒక్కోసారి ఇబ్బందవుతుంది. కాబట్టి భవిష్యత్‌ దృష్ట్యా బరువుపైనే కాక కండ శాతం, ఎముకల సాంద్రత మీదా దృష్టి పెట్టాలి.

తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల జీవక్రియా రేటు తగ్గిపోతుంది. ఆ ప్రమాదం రాకుండా శారీరక శ్రమను పెంచుకోండి. ఇంటర్‌మిటెన్ట్‌ ఫాస్టింగ్‌ పద్ధతిలోనూ తగ్గొచ్చు. దీనిలో రోజులో 16 గంటలు ఏమీ తినకుండా మిగిలిన సమయంలోనే ఆహారం తీసుకోవాలి. అయితే మాంసకృత్తులు, పీచు, విటమిన్లు, ఎసెన్షియల్‌ కొవ్వులు ఉండేలా చూసుకోవాలి. గుండె జబ్బుల ప్రమాదం తగ్గాలంటే ఏ ఆహార నియమాలు పాటించినా రక్తాన్ని పలుచగా చేసే పోషకాలుండేలా చూసుకోవాలి. ఇందుకోసం ఫోలిక్‌ ఆమ్లం, మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, ఆకుపచ్చ కాయగూరలు, గుమ్మడి, పొట్టున్న ధాన్యాలు, పండ్లు, సజ్జలు, అలసందలు, సెనగలకు ప్రాధాన్యమివ్వాలి. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని