అయిదో నెలలో మాంసాహారం తినొచ్చా?

నాకిప్పుడు అయిదో నెల. ఇలాంటప్పుడు రెండింతల ఆహారం తినాలా? మాంసం తీసుకోవచ్చా? బిడ్డ ఎదుగుదలకు ఇంకా ఏ మార్పులు చేసుకోవాలి?

Updated : 05 May 2022 12:39 IST

నాకిప్పుడు అయిదో నెల. ఇలాంటప్పుడు రెండింతల ఆహారం తినాలా? మాంసం తీసుకోవచ్చా? బిడ్డ ఎదుగుదలకు ఇంకా ఏ మార్పులు చేసుకోవాలి?

- జ్యోతి, హైదరాబాద్‌

ల్లీబిడ్డల ఆరోగ్యంలో ఆహారానిదే ప్రధాన పాత్ర. ప్రెగ్నెన్సీలో తగిన మోతాదులో బరువు తప్పక పెరగాలి. కాబట్టి కొంచెం ఎక్కువ శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి. లేదంటే పోషక లేమి వల్ల బిడ్డ ఎదుగుదల సరిగా ఉండదు. సరైన బరువున్నవారు 9 నుంచి 12 కిలోలు పెరగొచ్చు. ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం కంటే పోషకాలు అధికంగా ఉండేలా చూసుకోవాలి. సాధారణంగా తీసుకునే దానికంటే 300 గ్రా. అదనంగా తీసుకుంటే సరిపోతుంది. పైగా అయిదో నెల నుంచి కొద్దిగా ఎక్కువ ఆహారం అవసరమవుతుంది.

ఉండాల్సిన దాని కంటే అధిక బరువున్న గర్భిణులు ఆహార మోతాదును పెంచుకోవద్దు. కానీ, పోషకాలు అందేలా మాత్రం చూసుకోవాలి. ఇందుకోసం ఎక్కువ ప్రొటీన్లు, తక్కువ కెలొరీలు, స్వల్ప శక్తినిచ్చే ఆహారాన్ని తినాలి. మిల్క్‌షేక్స్‌, పండ్ల రసాలు, వేపుళ్లు, స్వీట్లు, చాక్లెట్లు వద్దు. తక్కువ నూనెతో చేసినవి, ఎక్కువ పోషకాలతో, నిదానంగా జీర్ణమయ్యేవి తినాలి. ఓట్స్‌, మొలకెత్తిన గింజలు, ఉడకబెట్టిన శనగలు, లో ఫ్యాట్‌ పాలు, పెరుగు, చేపలతోపాటు కూరగాయలను చట్నీ, సూపుల్లా తీసుకోవాలి. అప్పుడు బరువూ నియంత్రణలో ఉంటుంది. బిడ్డకు కావాల్సిన పోషకాలు అందుతాయి.

అదనంగా ప్రొటీన్లు... బిడ్డను తయారుచేయడానికి తల్లి శరీరంలో వచ్చే నిర్మాణాత్మక పనులకు అదనంగా 20 గ్రాముల ప్రొటీన్లు కావాలి. కాబట్టి గర్భిణులు మాంసకృత్తులు ఎక్కువగా ఉండే పాలు, పెరుగు, పనీర్‌, గుడ్డు, చికెన్‌, మటన్‌ తీసుకోవాలి లేదంటే రోజుకు కనీసం 100-120 గ్రాముల పప్పుదినుసులు వాడాలి. అయితే ఇంత ఎక్కువ పప్పు తీసుకుంటే గ్యాస్‌ లాంటి ఇబ్బందులొస్తాయనుకుంటే పప్పును తగ్గించి.. పాలు, పాల పదార్థాలు, సోయా నగ్గెట్స్‌, టోఫో లాంటివి తీసుకోవాలి.. ఇనుము, ఫోలిక్‌ యాసిడ్‌, ఎ, సి, బి-కాంప్లెక్స్‌ విటమిన్లు, జింక్‌ ఇవన్నీ ఎక్కువ మోతాదులో గర్భధారణ సమయంలో అవసరమవుతాయి. కాబట్టి కూరగాయలు, నూనెగింజల మోతాదు పెంచాలి. పొట్టుతో పిండి పట్టించిన తృణధాన్యాలు (రాగి, సజ్జలు, జొన్నలు, కొర్రలు) వాడినప్పుడు తల్లికి అవసరమయ్యే మైక్రోన్యూట్రియంట్స్‌ లభిస్తాయి. రకరకాల ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు తింటే అన్ని పోషకాలు తల్లీబిడ్డకూ అందుతాయి.
మాంసాహారాన్ని బాగా ఉడికించి తినాలి. ముక్కలను తీసుకుంటే చాలు. గ్రేవీ ఎక్కువగా తినొద్దు. దీని వల్ల ఆయాసం, బరువు పెరుగుతాయి. గర్భిణుల్లో హార్మోన్ల తేడా వల్ల ఒక్కోసారి మలబద్ధకం, ఆయాసం, ఎసిడిటీ లాంటివి అధికమవుతాయి. బిడ్డ ఎదిగే క్రమంలో జీర్ణకోశంలో మార్పులు వస్తాయి. కాబట్టి మాంసాహారాన్ని తేలికగా ఉండేలా చూసుకోవాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని