వేసవిలో.. జలుబా?

శీతాకాలం పూర్తవగానే హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాం కానీ.. వేసవీ జలుబు తెస్తుంది. పిల్లల నుంచి మొదలై ఇంటిల్లపాదినీ పలకరిస్తుంది. వేడి వల్ల అనుకుంటాం. కానీ ఒక రకమైన వైరస్‌ కారణమంటున్నారు నిపుణులు. తగ్గాలంటే.. ఈ చిట్కాలని పాటించేయండి. జలుబంటే ముక్కు కారడం వరకే పరిమితమై పోదిది. ఒళ్లునొప్పులు, ముక్కు కారడం, దగ్గు, గొంతునొప్పి, ఛాతి బరువుగా అనిపించడం, కంటి నుంచి నీరు కారడం.. కొన్నిసార్లు జ్వరంగానూ అనిపిస్తుంది....

Published : 04 Jun 2022 00:59 IST

శీతాకాలం పూర్తవగానే హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాం కానీ.. వేసవీ జలుబు తెస్తుంది. పిల్లల నుంచి మొదలై ఇంటిల్లపాదినీ పలకరిస్తుంది. వేడి వల్ల అనుకుంటాం. కానీ ఒక రకమైన వైరస్‌ కారణమంటున్నారు నిపుణులు. తగ్గాలంటే.. ఈ చిట్కాలని పాటించేయండి.

జలుబంటే ముక్కు కారడం వరకే పరిమితమై పోదిది. ఒళ్లునొప్పులు, ముక్కు కారడం, దగ్గు, గొంతునొప్పి, ఛాతి బరువుగా అనిపించడం, కంటి నుంచి నీరు కారడం.. కొన్నిసార్లు జ్వరంగానూ అనిపిస్తుంది. వైరస్‌ కారణంగా వస్తుంది కదా! రోగనిరోధకతపై ప్రభావం చూపుతుంది. దీంతో నీరసంగానూ అనిపిస్తుంది. కాబట్టి, ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడం, నిద్రపోవడం చేయాలి. ఈ సమయంలో వ్యాయామాలకు దూరంగా ఉండటం మంచిది.

నీటిని ఎక్కువగా తీసుకోవాలి. త్వరగా శక్తినిచ్చే గ్లూకోజ్‌ పానీయాలూ తీసుకోవచ్చు. టీ, కాఫీలకు దూరంగా ఉంటూ విటమిన్‌ సి ఎక్కువగా ఉండే నిమ్మ, కమలా రసాలను తాగాలి. ఇవీ ఇమ్యూనిటీని పెంచడమే కాదు శరీరంలోకి చేరిన బ్యాక్టీరియా, వైరస్‌లతోనూ పోరాడతాయి. వీటితోపాటు ఐరన్‌, జింక్‌ ఎక్కువగా ఉండే ఆహారానికి ప్రాధాన్యమివ్వాలి.

వేడి వల్ల అనుకొని అల్లం, మసాలాలకు దూరంగా ఉంటాం. అది తప్పు. అల్లం, వెల్లుల్లి, పసుపు, మిరియాలు, దాల్చినచెక్క వంటివి ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. రోగనిరోధకతను పెంచడంలో అవి సాయపడతాయి. ఇంకా గొంతు నొప్పిని దూరం చేయడమే కాదు శరీరాన్నీ తెలిక పరుస్తాయి. అల్లం, తేనె నీటినీ తరచూ తీసుకోవచ్చు.

ముక్కులు మూసుకుపోయినట్లుగా అనిపిస్తే ఆవిరి పట్టొచ్చు. గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇంకా కర్చీఫ్‌లకు బదులుగా వెట్‌ వైప్‌లను వాడటం, తుమ్మినా, దగ్గినా వెంటనే చేతులు శుభ్రం చేసుకునేలా చూడ్డం వంటివి చేస్తే.. ఇతరులకూ సోకే ప్రమాదముండదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్