Updated : 07/06/2022 07:12 IST

మెరిసేవన్నీ తాజా కాదు!

అంతర్జాతీయ ఆహార భద్రతా దినోత్సవం

ఆహా... నిగనిగలాడే తాజా కాయగూరలు తెచ్చుకున్నామని మురిసిపోతున్నారా? ఒక్క నిమిషం. అలా మెరిసేదంతా తాజాదనం కాకపోవచ్చు. కల్తీ తాలూకూ ముసుగు కూడా కావొచ్చు. మీ కుటుంబ ఆరోగ్యం మీ చేతుల్లో ఉండాలంటే ఆ కల్తీని ఇలా బయటపెట్టండి....

న రోజువారీ ఆహారంలో కల్తీని గుర్తించేందుకు ‘భారతీయ ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ’ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఇస్తున్న సూచనలివీ...


రంగుల మాయ: కంటికింపుగా ఉన్నాయని చిలగడదుంపల్ని చూసి మనసు పారేసుకుని కొనేశారా? వాటిని ఉడికించడానికి ముందు వంట నూనెలో లేదా నీళ్లలో ముంచిన దూదితో ఈ దుంపల్ని రుద్దండి. ఎర్రగా మారిందా? అయితే దానిపై రోడమైన్‌ అనే హానికారక రంగు ఉన్నట్టు లెక్క. ఇలానే బెండకాయలు, పాలకూర, పచ్చి బఠాణీల్నీ పరీక్షించండి. రంగు మారితే... అందులో మాల్కైట్‌ గ్రీన్‌ రంగు ఉన్నట్టే. ఈ రంగుల్ని కార్సినోజెనిక్స్‌ అంటే క్యాన్సర్‌ కారకాలుగా చెబుతారు. అందుకే... రంగుల్ని చూసి కాకుండా నమ్మకమైన చోట కొంటే మేలు.


పాలు స్వచ్ఛమేనా: ఆరోగ్యానికి మంచిదని మనం తాగే పాలల్లో కలుషిత నీళ్లే కాదు, స్టార్చ్‌, డిటర్జెంట్‌ పొడి వంటివి కలవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఒక మూత ఉన్న డబ్బాలోకి కొద్దిగా పాలు తీసుకుని బాగా గిలక్కొట్టండి. పొంగు, నురుగు ఎక్కువగా ఉంటే డిటర్జెంట్‌ని కలిపినట్టు. స్వచ్ఛమైన పాలు అంత నురుగునివ్వవు.


నూనె సంగతి తేల్చేద్దాం: కొబ్బరి నూనె మంచిదో కాదో తెలుసుకోవాలంటే... ఆ నూనెని ఓ అరగంట ఫ్రిజ్‌లో ఉంచండి. అరగంట తర్వాత నెయ్యిలా మొత్తం గడ్డకడితే అది మంచిదే. అలా కాకుండా సగం గడ్డకట్టి... కొంతమేరకు నూనె ద్రవరూపంలో ఉందంటే దానర్థం అందులో ఇతర నూనెలు కలిశాయని.


నెయ్యి మంచిదైతే: ఒక పాత్రలో కొద్దిగా నెయ్యి తీసుకుని అందులో కొద్దిగా టింక్చర్‌ అయోడిన్‌ కలిపి చూడండి. నెయ్యి నీలం రంగులోకి మారితే ఉడికించిన ఆలుగడ్డల, లేదా చిలగడదుంపల గుజ్జుతో కలుషితం చేసినట్టు.


తేనె మండిస్తే...: స్వచ్ఛమైన తేనెను నీటిలో వేసినప్పుడు అది నీటి అడుగు భాగానికి చేరిపోతుంది. అలాకాకుండా నీటితో త్వరగా కలిసిపోతే... అందులో పంచదార పాళ్లు ఉన్నట్టు. కాటన్‌ ఒత్తిని తేనెలో ముంచి వెలిగిస్తే అది చక్కగా వెలుగుతుంది. అలా కాక చిటపట శబ్దం చేస్తే నీళ్లు కలిసినట్టే.


ఆ ఘుమఘుమలో నిజమెంత: పులిహోర మొదలు...పచ్చళ్ల వరకూ అన్నింటికీ అమోఘమైన రుచిని తెచ్చే ఇంగువలో కల్తీని కనిపెట్టాలంటే.. చిన్న స్టీల్‌ చెంచాలో కొద్దిగా ఇంగువ తీసుకుని వెలిగించండి... మంచిదైతే కర్పూరలా వెలిగిపోతుంది. ఒకవేళ కల్తీ ఉంటే కాంతిమంతంగా వెలగదు.


అది దాల్చిన కాదా?: బిర్యానీలోకి, మాంసాహార వంటకాల్లోకీ రుచి కోసం వేసే దాల్చిన చెక్కలో తేడాని గుర్తించడం తేలికే? అసలైన దాల్చిన చెక్క మందంగా ఉండదు. సన్నగా పొరలతో ఉంటుంది. సన్నని పెన్ను లాంటిది ఏదైనా పెడితే దానికి చుట్టుకుంటుంది. కాసియా చెట్టు బెరడు కూడా దీనిలానే ఉన్నా... బెరడు మందంగా ఉంటుంది. దీనిని చైనా దాల్చిన చెక్క అంటారు.


ఏది మిరియం: కూరలకి ఘాటుదనం తెచ్చే మిరియాలు నిజమైనవో కాదో తెలుసుకోవాలంటే ఒక గాజు గ్లాసులో కొద్దిగా నీళ్లు తీసుకుని కాసిని మిరియాలు వేసి చూడండి. పైకి తేలితే అవి మిరియాలు కాదు. బొప్పాయి విత్తనాలు కావొచ్చు. అసలు మిరియాలు అడుక్కి చేరుకుంటాయి మరి.  కారంపై అనుమానం ఉంటే నీళ్లలో కాసింత కారం వేసి చూడండి. కారం రంగు మారి, నీటిలో తేలితే అది రంపం పొట్టు కావొచ్చు. రంగు మారకుండా అడుక్కి చేరుకుంటే అది మంచి కారం. ఇదే పద్ధతిలో కాఫీ పొడి వేసి.. చెంచాతో నిమిషం పాటు కలిపి చూడండి. అడుగున పొడి మిగలకపోతే అది మంచి కాఫీ పొడి. మిగిలిపోతే అందులో కల్తీ జరిగినట్టే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని