Published : 10/06/2022 00:34 IST

నడి వయసులో ఇవి తినాల్సిందే!

రమణికి 45 ఏళ్లు దాటాయి. ఉదయం అల్పాహారం నుంచి మధ్యాహ్నభోజనం, రాత్రి తేలికపాటి ఆహారం తీసుకుంటున్నా కూడా కొన్నిసమయాల్లో ఆమెను నీరసం ఆవహిస్తోంది. ఇలా మధ్యవయసులో ఉన్నవారు బ్యాలెన్స్డ్‌డైట్‌ని ఎంచుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం...

రోగ్యానికి కార్బొహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజలవణాలు, అసంతృప్త కొవ్వులు, ప్రొటీన్లు, పీచుతోపాటు నీరు అత్యంత అవసరం. వీటిలో దేని శాతం తగ్గినా శరీరానికి తగిన శక్తి అందదు. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో ఉంటేనే నిండైన ఆరోగ్యం సొంతమవుతుంది. ఆహారంలో కార్బొహైడ్రేట్లు 60 శాతం తప్పకుండా ఉండాలి. రోజులో అరగంటసేపు వ్యాయామం చేస్తూ కార్బొహైడ్రేట్‌-రిచ్‌ ఫుడ్స్‌ తీసుకుంటే ఇంకా మంచిది.

ఏ,బీ,సీ,డీ విటమిన్లు .. ఇవి అందేలా తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఆహారంలో ఉండాలి. అలాగే కాల్షియం, ఇనుము, అయోడిన్‌, పొటాషియం, సోడియం వంటి ఖనిజలవణాలు ఆరోగ్యానికి అత్యంత ముఖ్యం. ఇవి పుష్కలంగా ఉండేవాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటి నుంచి శరీరానికి తగినంత శక్తి అందుతుంది. ఇక అసంతృప్త కొవ్వుల ద్వారా ఆరోగ్యం దక్కుతుంది. ఇవి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడమే కాకుండా, తీసుకున్న ఆహారం నుంచి విటమిన్లను శరీరం తీసుకునేలా చేస్తాయి.

ప్రొటీన్లు.. ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైనవి. కండరాలు, చర్మం, శిరోజాలను నిత్యం ఆరోగ్యంగా ఉంచుతాయి. పాల ఉత్పత్తులు, మాంసాహారం, గుడ్లు వంటివి తీసుకోవాలి. పీచు ఉండే కూరగాయలు, పండ్లకు పెద్దపీట వేస్తే జీర్ణశక్తి మెరుగ్గా పనిచేసి, మలినాలు బయటకు పోతాయి. కొలెస్ట్రాల్‌ స్థాయులను పీచు సమన్వయం చేస్తుంది. దీంతో ఆరోగ్యానికి హాని కలగదు. వీటన్నింటితోపాటు నీరు శరీరాన్ని డీహైడ్రేట్‌ కాకుండా కాపాడుతుంది. అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. రోజుకి కనీసం ఎనిమిది గ్లాసుల నీటిని తీసుకుంటే మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని