మా అబ్బాయి చికెన్‌ మాత్రమే తింటాడు.. ఏమైనా ఇబ్బందులుంటాయా?

మా బాబు వయసు పదేళ్లు. అయితే చికెన్‌ లేదా పప్పు ఈ రెండే తింటున్నాడు. వేరే కాయగూరలు తినడు. ఇలా అయితే భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయా? అన్నీ తినేందుకు ఏం చేయాలి?

Updated : 23 Oct 2022 20:24 IST

మా బాబు వయసు పదేళ్లు. అయితే చికెన్‌ లేదా పప్పు ఈ రెండే తింటున్నాడు. వేరే కాయగూరలు తినడు. ఇలా అయితే భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయా? అన్నీ తినేందుకు ఏం చేయాలి?

- రేవతి, వైజాగ్‌

దేళ్లు వచ్చేటప్పటికీ పిల్లలు ఆహారపుటలవాట్లు అలవర్చుకుంటుంటారు. మనం ఎక్కువగా అన్నం, చపాతి తింటుంటాం. వాటిలో చికెన్‌, పప్పు కూరలుగా తింటాం. అందువల్లే వాటికి చాలామంది అలవాటు పడిపోతారు. ఇలాంటి వాళ్లు కాయగూరలు, ఆకుకూరలకు దూరమవుతారు. కానీ వీటిలో చాలా రకాల విటమిన్లు, ఖనిజలవణాలు ఇంకా పోషకాలెన్నో ఉంటాయి. ఇవన్నీ శరీరానికి అందకుండా పోతాయి. రైస్‌, రోటీ ద్వారా ప్రొటీన్‌, క్యాలరీలు అందుతాయి. కానీ కూరగాయలతో పీచు, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్లు, యాంటి ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్‌ వీటిలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం.. ఇంకా మైక్రో న్యూట్రియంట్స్‌ అందుతాయి. ఇవన్నీ చిన్న మొత్తంలో ఉన్నప్పటికీ ఆరోగ్యరీత్యా ముఖ్య పాత్ర పోషిస్తాయి. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌(వాపు)ని తగ్గిస్తాయి. అవయవాలు పాడవకుండా కాపాడి వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తాయి. వంకాయ, టొమాటో, బెండకాయ, ఉల్లిపాయలు, అల్లం, బీట్‌రూట్‌, క్యారట్‌.. ఇలా ప్రతి దాన్నినుంచీ ప్రత్యేక లాభాలు ఉంటాయి. రోజూ 150-200 గ్రాముల కూరగాయలు, 50-100 గ్రాముల ఆకుకూరలూ ఆహారంలో తీసుకోవాలి. న్యూట్రిషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సర్వేలో 70 శాతం భారతీయులకు రక్తహీనత (అనీమియా) ఉందని తేలింది. శరీరానికి తగినంత ఇనుము అందుతున్నప్పటికీ మిగతా విటమిన్లు, ఆహారంలో వైవిధ్యం లేకపోవడం దీనికి కారణం. కూరగాయలు తీసుకోకపోతే మలబద్ధకం లాంటివి వస్తాయి. చర్మం మీద మచ్చల్లాంటివి ఏర్పడతాయి. ఎముకలు బలహీనపడతాయి. శరీర కదలిక సవ్యంగా ఉండదు.

ఎలా అలవాటు చేయాలి?

పిల్లలకు చెప్పేముందు వీటిని తీసుకోవడంలో పెద్దలే ఉదాహరణగా ఉండాలి. సీజన్లో వచ్చే కూరగాయలూ, ఆకుకూరలన్నింటినీ చిన్నప్పట్నుంచీ అలవాటు చేసుకుంటే ఈ సమస్య రాదు. రంగు, రుచి, వాసన.. ఇవి పిల్లల్ని ఆకర్షిస్తాయి. కాబట్టి పిల్లలు కూరగూయలూ, ఆకుకూరలూ, పండ్లని చూసేలా, తాకేలా చేసి ఆసక్తి పెంచాలి. కూరలుగా కాకపోయినా స్నాక్స్‌, వెజిటబుల్‌ బిర్యానీ, సలాడ్లు, రైతా, చట్నీ.. ఇలా ఏదో ఒక రూపంలో భాగం చేయాలి. మొదటిసారి తిన్నపుడు కారం, పులుపు, చేదు.. ఉంటే అప్పట్నుంచీ తినడానికి ఆసక్తి చూపరు. కాబట్టి కొన్నింటిలో బెల్లం వేసి వండి పెట్టొచ్చు. కాయగూరలు తింటే బలమనీ, ఆరోగ్యంగా ఉంటామని చెబుతూ వారిలో మార్పు తేవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని