హార్మోన్స్‌తో అందం...

ఐశ్వర్యారాయ్‌ అందానికి కారణం తను నిత్యం సంతోషంగా ఉండటమే అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. సంతోషం సగం బలం అంటారు కదా.. ఈ అందమేంటి అనుకుంటున్నారా. మీరు విన్నది నిజమే. నిత్యం సంతోషంగా ఉండే వారిలో విడుదలయ్యే నాలుగు

Updated : 16 Jun 2022 04:21 IST

ఐశ్వర్యారాయ్‌ అందానికి కారణం తను నిత్యం సంతోషంగా ఉండటమే అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. సంతోషం సగం బలం అంటారు కదా.. ఈ అందమేంటి అనుకుంటున్నారా. మీరు విన్నది నిజమే. నిత్యం సంతోషంగా ఉండే వారిలో విడుదలయ్యే నాలుగు రకాల హార్మోన్లు ముఖారవిందాన్ని మరింత మెరిసిపోయేలా చేస్తాయంటున్నారు నిపుణులు.

సంతోషంగా ఉన్నవారిలో నాలుగురకాల హ్యాపీ హార్మోన్స్‌ ఉత్పత్తి అవుతాయి. ఇవి శరీరమంతా వ్యాపించి ప్రతి అవయవానికీ సమాచారాన్ని అందించి జీవక్రియలను సక్రమంగా జరిగేలా చేస్తాయి. ముఖ్యంగా మెదడును ఉత్సాహంగా ఉంచుతాయి. సానుకూల ఆలోచనలను రప్పిస్తాయి. వీటిలో మొదటిది డోపమైన్‌ హార్మోన్‌. దీన్ని ‘ఫీల్‌-గుడ్‌’ హార్మోన్‌గా పిలుస్తారు. ఇది మెదడుకు ఆహ్లాదరకమైన ఇంద్రియ జ్ఞానాన్ని అందిస్తుంది. మరొక హార్మోన్‌ ‘సెరోటోనిన్‌’. ఇది మెదడును నియంత్రించి కంటినిండా నిద్ర రప్పిస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. సృజనాత్మకత, జ్ఞాపకశక్తి వంటి నైపుణ్యాలను పెంచుతుంది. ఇవన్నీ శారీరక, మానసికారోగ్యాన్ని అందిస్తాయి. మూడోది ‘ఆక్సిటోసిన్‌’. దీన్ని ‘లవ్‌ హార్మోన్‌’ అని కూడా పిలుస్తారు. ఇది ప్రసవం తర్వాత బిడ్డకు పాలుపట్టేటప్పుడు తల్లీబిడ్డల మధ్య అనుబంధాన్ని మరింత గట్టిపడేలా చేస్తుంది. నమ్మకం, సానుభూతి, ఎదుటివారిని ప్రేమించడంలో ప్రోత్సహిస్తుంది. తోటివారితో అనుబంధాలను మరింత పెరిగేలా చేస్తుంది. చివరిది ‘ఎండోర్ఫిన్స్‌’ హార్మోన్‌. ఇది శరీరంలో కలిగే అనారోగ్యం, మానసిక ఒత్తిడికి ఉపశమనాన్నిస్తుంది. ఈ హార్మోన్లన్నీ మనసును హాయిగా ఉన్నట్లు చేసి, ముఖంపై చిరునవ్వును చెరగనివ్వవు. దీంతో రక్తప్రసరణ సవ్యంగా జరగడమే కాకుండా, కండరాలన్నింటికీ వ్యాయామంలా మారుతుంది. దీంతో ముఖచర్మం ఆరోగ్యంగా మారి, కొత్త మెరుపును సంతరించుకుంటుంది. కళ్లల్లో మెరుపు కనపడుతుంది. ఇదంతా ముఖారవిందాన్ని మరింత అందంగా కనిపించేలా చేస్తుంది.

నవ్వుతూ.. ప్రతి నిమిషాన్నీ నవ్వుతూ గడిపే వారి ముఖంలో ప్రత్యేకమైన మెరుపు ఉంటుంది. ఇటువంటి వారిలో తమకెదురయ్యే సమస్యలను తేలికగా పరిష్కరించుకోగలిగే నైపుణ్యం ఉంటుంది. సంతోషంగా ఉంటూ సానుకూలంగా స్పందిస్తూ ఒత్తిడి, ఆందోళన వంటివాటికి దూరంగా ఉంటారు. వీరి మెదడు ఉత్సాహవంతంగా మారి జీవితంలో అనుకున్న లక్ష్యాలనూ త్వరగా చేరుకుంటారు. ఇలా సంతోషంగా ఉన్నవారిలో విడుదలయ్యే హార్మోన్ల వల్ల అందమే కాదు, ఆరోగ్యమూ సొంతమేనట.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్